కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti) మొత్తం రూ.9 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా, సాగునీటి రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, నిధుల కొరత లేకుండా అన్ని మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. దానవాయిగూడెంలోని టి.జి.ఎస్. డబ్యూ,ఆర్.ఎస్. బాలికల జూనియర్ కళాశాలలో రూ.2.25 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం ఊటవాగు తండా వద్ద రూ.6.75 కోట్లతో నిర్మించనున్న చెక్ డ్యామ్ పనులకు భూమిపూజ చేశారు.
కళాశాల ప్రాంగణంలో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ గురుకుల పాఠశాలలలో చదువుతున్న పేద విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. డైట్ ఛార్జీలను 40 శాతం, కాస్మెటిక్ ఛార్జీలను 200 శాతం పెంచినట్లు మంత్రి గుర్తుచేశారు. అధికారులు, ప్రిన్సిపాల్ సమన్వయంతో పనులను వేగంగా పూర్తి చేయాలని, వచ్చే 15 రోజులలో మైదానం, పరిసరాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్, ఆర్అండ్బీ ఈఈ బషీర్, కళాశాల ప్రిన్సిపాల్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

