Mobile Popup Ad
Mobile Popup Ad

ఫిఫాపై ఇరాన్ కెప్టెన్ మెహదీ తారెమీ తీవ్ర అసంతృప్తి

కలం, వెబ్ డెస్క్ : ఫిఫా ప్రపంచకప్ 2026లో ఇరాన్ జట్టు నాకౌట్ అవకాశాలు ఇప్పుడు వేరే జట్ల ఫలితాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ కీలక సమయంలో ఇరాన్ కెప్టెన్ మెహదీ తారెమీ (Mehdi Taremi ) మైదానం వెలుపల తమకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఫిఫా యాజమాన్యంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టోర్నమెంట్‌లో ప్రయాణ ఏర్పాట్లు చాలా అధ్వాన్నంగా ఉన్నాయని, ఇది ఒక పెద్ద విపత్తు అని ఆయన మండిపడ్డారు. శుక్రవారం జరిగిన గ్రూప్-జి మ్యాచ్‌లో ఈజిప్ట్, ఇరాన్ జట్ల మధ్య పోరు 1-1తో డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో ఈజిప్ట్ తరఫున మహ్మూద్ సాబ్రే తొలి గోల్ చేయగా, ఆ తర్వాత ఇరాన్ ఆటగాడు రామిన్ రెజాయన్ గోల్ చేసి స్కోరును సమం చేశారు.

రామిన్ రెజాయన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా దక్కింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఇరాన్ కెప్టెన్ తారెమీ పెనాల్టీ లభించినా దానిని గోల్‌గా మార్చలేకపోయారు. చివరి నిమిషంలో ఇరాన్ చేసిన మరో గోల్‌ను వీఏఆర్ (VAR) టెక్నాలజీ ద్వారా అంపైర్లు ఆఫ్‌సైడ్‌గా ప్రకటించారు. దీంతో మ్యాచ్ డ్రా అయింది. ఈ డ్రాతో ఈజిప్ట్ నాకౌట్ దశకు చేరుకోగా, ఇరాన్ మాత్రం ఉత్తమ థర్డ్ ప్లేస్ జట్ల జాబితాలో అవకాశం కోసం వేచి చూడాల్సి వస్తోంది. మ్యాచ్ ముగిసిన వెంటనే మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు తారెమీ సమాధానమిస్తూ.. తమ జట్టు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు.

టోర్నీ ప్రారంభం నుండి సహాయక సిబ్బందికి వీసాలు రాకపోవడంతో కిట్‌మెన్, మీడియా మేనేజర్లు లేకుండానే తాము ఆడుతున్నామని చెప్పారు. మొదటి మ్యాచ్ సమయంలో ఫిఫా అధ్యక్షుడు ఇన్ఫాంటినో తమ డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చి సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, కానీ గ్రూప్ స్టేజ్ ముగుస్తున్నా ఏ ఒక్క సమస్య తీరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మ్యాచ్ ముగిసిన వెంటనే ఎలాంటి విశ్రాంతి లేకుండా మళ్లీ మెక్సికోలోని టిజువానా బేస్ క్యాంప్‌నకు ప్రయాణం చేయాల్సి రావడం ప్రొఫెషనల్ ఆటగాళ్లకు ఏమాత్రం న్యాయం కాదని ఆయన అన్నారు.

టిజువానా ప్రజలను తాము గౌరవిస్తామని, కానీ కనీస రికవరీ సమయం కూడా లేకుండా ప్రయాణాలు చేయడం ఆటపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. వరుసగా వీఏఆర్ నిర్ణయాలు తమకు వ్యతిరేకంగా రావడం కంటే, మైదానం వెలుపల ఉన్న ఇలాంటి చిన్న చిన్న లోపాలే తమను మానసికంగా దెబ్బతీస్తున్నాయని చెప్పారు. పెనాల్టీ మిస్ చేసినందుకు తానే బాధ్యత వహిస్తానని, తమ దేశ ప్రజల ఆనందం కోసమే తాము శాయశక్తులా పోరాడుతున్నామని తారెమీ స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>