కలం, వెబ్‌డెస్క్: పాటలకు సౌండ్ రికార్డింగ్ కాపీరైట్ (Sound Recording Copyright) విషయంలో ఢిల్లీ హైకోర్టు సరికొత్త తీర్పు నిచ్చింది. సౌండ్ రికార్డింగ్ పూర్తయిన 60 ఏళ్లకు లైసెన్స్ గడువు ముగుస్తుందని, దానికి కాపీరైట్ వర్తించదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ కేసులో ఇచ్చిన తీర్పును విశదీకరించింది. కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. బిగ్నెట్ సొల్యూషన్స్ ఎల్ఎల్పీ ఆర్గనైజర్స్.. ఒక ఈవెంట్లో పాత పాటలు ప్లే చేసేందుకు ప్రయత్నించగా, వాటి సౌండ్ రికార్డింగ్‌పై తమకు హక్కులున్నాయంటూ నోవాక్స్ సంస్థ అడ్డుకుంది. దీంతో వివాదం కోర్టుకు చేరింది. ఈ సందర్భంగా కాపీరైట్ చట్టం 1957లోని సెక్షన్ 27 ప్రకారం ఏదైనా సౌండ్ రికార్డింగ్‌కు గడువు 60 ఏళ్లు మాత్రమే ఉంటుందని ఢిల్లీ హైకోర్టు(Delhi HC) స్పష్టం చేసింది. ఆ తర్వాత అది ప్రజాక్షేత్రంలోకి వచ్చినట్లేనని, దానిని వాడుకోవడానికి ఎలాంటి లైసెన్స్ అవసరం లేదని పేర్కొంది.
ఈ తీర్పు ప్రకారం 1965కు ముందు రికార్డయిన చాలా పాటల సౌండ్ రికార్డింగ్ లైసెన్స్ గడువు ఈ ఏడాదితో ముగుస్తోంది. భారతీయ సినిమాకు స్వర్ణయుగంగా భావించే ఆనాటి రోజుల పాటల సౌండ్ రికార్డింగ్ పై ఇకమీదట ఎలాంటి లైసెన్స్ ఉండదు. వాటిని అందరూ వాడుకోవచ్చు. కాగా, పెళ్లిళ్లు, ఉత్సవాలు, జాతరలు వంటి శుభకార్యాల్లో పాటలను ప్లే చేయడం కాపీరైట్ కిందకు రాదని, ఆ పాటలకు ఏ ఒక్కరూ రాయల్టీ వసూలు చేయవద్దని రెండేళ్ల కిందటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషనల్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐఐటీ) స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. సాధారణంగా ఏదైనా పాటపై హక్కు ఉన్న రచయిత/స్వరకర్త మరణించిన 60 ఏళ్ల తర్వాత సాహిత్యం, సంగీతంపై వాళ్లకు హక్కు పోతుంది. ఇప్పుడు సౌండ్ రికార్డింగ్‌కు సైతం అదే గడువు వర్తించనుంది. పాట సౌండ్ రికార్డయిన నాటి నుంచి 60 ఏళ్ల వరకు మాత్రమే వాటికి లైసెన్స్ ఉంటుందని, ఆ తర్వాత వాటికి కాపీరైట్ చట్టం వర్తించదని ఢిల్లీ హైకోర్టు(Delhi HC) తీర్పు చెబుతోంది.
Read Also: బీజేపీ విధానాలతో చిరువ్యాపారులకు తీవ్రనష్టం : రాహుల్ గాంధీ
Follow Us On: Youtube


