కలం, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) గాలి నాణ్యత రోజురోజుకూ పడిపోతోంది. దీంతో ఢిల్లీవాసులు ‘ఈ గాలిని పీల్చలేం’ అంటూ రోడ్డెక్కుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో తెలియజేస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం ఎటూ చూసిన పొగ మంచు ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల రాకపోకలకు సైతం తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. శనివారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక (AQI) 397 చేరుకోవడంతో దట్టమైన పొగమంచు ఢిల్లీని ఆవరించింది. దాదాపు 21 ప్రాంతాల్లో గాలి నాణ్యత పడిపోయింది. AQI రీడింగులు 400 మార్కును దాటాయని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB) హెచ్చరించింది.
CPCB డేటా ప్రకారం.. వజీర్‌పూర్‌లో అత్యధిక AQI 445 నమోదు కాగా, వివేక్ విహార్ 444, జహంగీర్‌పురిలో 442, ఆనంద్ విహార్ 439, అశోక్ విహార్ మరియు రోహిణిలో ఒక్కొక్కటి 437 నమోదయ్యాయి. నరేలాలో 432, ప్రతాప్‌గంజ్‌లో 431, ముండ్కాలో 430, బవానా, ఐటీఓ, నెహ్రూ నగర్‌లలో 429 AQI నమోదైంది. చాందిని చౌక్, పంజాబీ బాగ్‌లలో 423 వద్ద ఉండగా, సిరి ఫోర్ట్, సోనియా విహార్ ప్రాంతాల్లో 424 నమోదయ్యాయని CPCB తెలపింది.
శనివారం ఢిల్లీ (Delhi)లో గాలి నాణ్యత ‘వెరీ పూర్’ కేటగిరీలో ఉందని, ఆదివారం ‘తీవ్రమైన’ కేటగిరీలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఎయిర్ క్వాలిటీ ముందస్తు హెచ్చరిక వ్యవస్థ అంచనా వేసింది. ఢిల్లీలో పొగమంచు కమ్ముకోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది మాస్కులు ధరించి బయటకొస్తున్నారు. పిల్లలు, పెద్దలు ఇళ్లకే పరిమితమయ్యారు. గాలి నాణ్యత మెరుగయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఢిల్లీవాసులు కోరుతున్నారు.
Read Also: ఎన్నికల తర్వాత నిధుల వేట.. ఢిల్లీకి మంత్రి, అధికారుల బృందం
Follow Us On: X(Twitter)


