కలం, స్పోర్ట్స్ : లక్నోలోని ఏకానా స్టేడియంలో లక్నో సూపర్ జాయింట్స్ (Luknow Super Giants) నిర్మించుకున్న కోటను సమీర్ రిజ్వీ తన బ్యాటింగ్ పవర్ హౌస్‌తో బద్దలు కొట్టాడు. ఢిల్లీ (Delhi Capital) ఓడిపోతుందేమో అన్న దగ్గర నుంచి ఒంటి చేత్తో జట్టును విజయతీరాలకు తీసుకెళ్లాడు రిజ్వీ. అంతా వరుసబెట్టి పెవిలియన్ చేరుతున్నా ఒత్తిడికి గురికాకుండా రిజ్వీ నిలకడగా రాణించి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 142 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆరంభంలోనే లక్నో బౌలర్లు షాకుల మీద షాకులు ఇచ్చారు. మొహమ్మద్ షమీ వేసిన తొలి బంతికే కెప్టెన్ కేఎల్ రాహుల్ గోల్డెన్ డకౌట్ కావడం, ఆపై నితీష్ రానా (15), నిశ్శంక (1) స్వల్ప స్కోర్లకే వెనుదిరగడంతో ఢిల్లీ 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రిన్స్ యాదవ్ వేసిన ఇన్‌స్వింగర్‌కు అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ అయిన తీరు చూస్తే లక్నో విజయం ఖాయమనిపించింది. కానీ, అక్కడే అసలైన సెన్సేషన్ మొదలైంది.
యువ సంచలనం సమీర్ రిజ్వీ క్రీజులోకి అడుగుపెట్టాక మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఏమాత్రం బెదరకుండా లక్నో (Luknow Super Giants) బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 47 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 70 పరుగులు చేసి ఢిల్లీకి తిరుగులేని విజయాన్ని అందించాడు. అతనికి తోడుగా ట్రిస్టన్ స్టబ్స్ (39 నాటౌట్) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడటంతో ఢిల్లీ (Delhi Capital) మరో 17 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో లక్నోను చిత్తు చేసింది. లక్నో బౌలర్లలో మొహ్సిన్ ఖాన్ 19 పరుగులిచ్చి ఒక వికెట్ తీసి కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా, షాబాజ్ అహ్మద్, అన్రిచ్ నోర్ట్జేలు ధారాళంగా పరుగులివ్వడం ఆ జట్టును దెబ్బతీసింది.
అంతకుముందు బ్యాటింగ్‌లోనూ లక్నో తీవ్రంగా నిరాశపరిచింది. ఢిల్లీ బౌలర్లు కుల్దీప్ యాదవ్, నటరాజన్, లుంగీ ఎన్గిడిల ధాటికి లక్నో బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. మిచెల్ మార్ష్ (35), అబ్దుల్ సమద్ (36) మినహా మిగిలిన వారంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆయుష్ బదోని, అన్రిచ్ నోర్ట్జే, మొహ్సిన్ ఖాన్‌లు సున్నాలకే పరిమితం కావడంతో లక్నో 18.4 ఓవర్లలో 141 పరుగులకే చతికిలబడింది. మొత్తానికి లక్నో నిర్దేశించిన లక్ష్యాన్ని ఢిల్లీ అలవోకగా ఛేదించి పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది.

