కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీ ఎయిర్ పోర్ట్ (Delhi Airport) లో ప్రమాదం చోటు చేసుకుంది. రన్ వేపై రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ మేరకు రన్ వేపై ఉన్న ఆకాశ ఎయిర్ విమానాన్ని స్పైస్ జెట్ విమానం ఢీకొట్టింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయల్దేరేందుకు సిద్ధంగా ఉన్న ఆకాశ ఎయిర్ విమానాన్ని పార్కింగ్ వైపు వస్తున్న స్పైస్ జెట్ విమానం పక్కకు తాకుతూ వెళ్లింది. ఈ ఘటనలో ఆకాశ ఎయిర్ విమానం వెనుక భాగం, స్పైస్ జెట్ విమానం రెక్క దెబ్బతిన్నాయి . అయితే ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఈ సంఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. డీజీసీఎ (DGCA) నిబంధనల ప్రకారం దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
కాగా, ఇటీవల దేశంలో విమాన ప్రమాదాలు ఎక్కువ అవుతుండడం తీవ్ర కలకలం రేపుతోంది. గతేడాది అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 241 మంది ప్రయాణికులు మరణించారు. ఆ తర్వాత విమానాల్లో వరుసగా సాంకేతిక సమస్యలు వస్తుండడం ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి సమయంలో ఢిల్లీ ఎయిర్ పోర్టులో (Delhi Airport) రెండు విమానాలు ఢీ కొనడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. విమానాల్లో భద్రత లేకుండా పోతుందని ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు.
Read Also: ఆత్మరక్షణలో బీజేపీ.. జీహెచ్ఎంసీలో నెగెటివ్ ఎఫెక్ట్..
Follow Us On: X(Twitter)

