కలం, హనుమకొండ: హనుమకొండ జిల్లా కాజీపేట (Kazipet) పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య (Degree Student Suicide) చేసుకోవడం విషాదాన్ని మిగిల్చింది. ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న జుహేరియా (19) ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం, జుహేరియా కుటుంబం గత నాలుగు నెలలుగా హనుమకొండలోని నయీంనగర్‌లో అద్దెకు నివాసం ఉండేది.
ఇటీవల అక్కడి ఇల్లు ఖాళీ చేసి కాజీపేటలోని జూబ్లీ మార్కెట్ ప్రాంతంలోని మరో అద్దె ఇంటికి మారింది. సుమారు పది రోజుల క్రితం కళాశాల నిర్వహించిన స్టడీ టూర్‌కు వెళ్లిన జుహేరియా, మూడు రోజుల క్రితమే ఇంటికి తిరిగి వచ్చింది. ఈ క్రమంలో శనివారం రాత్రి కుటుంబ సభ్యులతో ఆమెకు వాగ్వాదం జరిగినట్లు సమాచారం. అనంతరం కుటుంబ సభ్యులు భోజనానికి వెళ్లిన సమయంలో జుహేరియా తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుంది.
కొద్దిసేపటి తర్వాత కుటుంబ సభ్యులు గదిలోకి వెళ్లి చూడగా ఆమె ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే కిందకు దించి పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.
మృతురాలి చేతిపై కోసుకున్న గాయాలు కూడా ఉన్నట్లు గుర్తించారు. ఆ గాయాలు ఎప్పుడు, ఎలా అయ్యాయనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాజీపేట పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, ఇతర పరిస్థితులను పరిశీలిస్తూ ఘటనకు గల కారణాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

