కలం, వెబ్ డెస్క్ : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం (Deep Depression) పశ్చిమ వాయువ్య దిశగా వేగంగా పయనిస్తోంది. ప్రస్తుతం ఇది విశాఖపట్నానికి 220 కిలోమీటర్ల దూరంలో, కళింగపట్నానికి 140 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మరింత బలపడి నేడు విశాఖపట్నం – గోపాల్పూర్ మధ్య, ముఖ్యంగా కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం వెంబడి గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే వీలుండటంతో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని అధికారులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. పరిస్థితుల తీవ్రత దృష్ట్యా అన్ని ప్రధాన ఓడరేవుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు.
ఈ ప్రభావంతో నేడు, రేపు ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉనందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా విశాఖపట్నం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లోని పాఠశాలలకు అధికారులు నేడు సెలవు ప్రకటించారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంపైనా ఈ తీవ్ర వాయుగుండం ప్రభావం తీవ్రంగా ఉండనుంది. రాగల రెండు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో తెలంగాణలోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. పెద్దపల్లి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు నమోదు కానున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకూడదని అధికారులు స్పష్టం చేశారు.

