కలం, నిజామాబాద్ బ్యూరో : రాకాసి చైనా మాంజా (Chinese Manja) ప్రాణాంతకరంగా మారుతోంది. జిల్లాకు చెందిన ఓ బాలుడికి కొద్దిలో ప్రాణాపాయం తప్పింది. కానీ మెడ భాగంలో తెగి 25 కుట్లు పడ్డాయి. ‘ఇంకొంచెం తెగి ఉంటే మా మనవడి ప్రాణాలు పోయేవని డాక్టర్లు చెప్పారు. టైమ్ కు హాస్పిటల్ కు తీసుకొచ్చి బతికించుకున్నాం. చైనా మాంజాను ఎవరూ వాడొద్దు’ అంటూ బాధిత బాలుడు శ్రీ హాన్ అమ్మమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీహాన్ జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో అమ్మమ్మ ఇంటికి పండుగ కోసం వెళ్లాడు. ఇంటి బయట పిల్లలు చైనా మాంజాతో (Chinese Manja) పట్టుకొని ఆడుకుంటుండగా.. శ్రీ హాన్ మెడకు మాంజా చుట్టుకుంది. పిల్లలు అలాగే లాక్కుంటూ వెళ్లడంతో శ్రీహాన్ మెడ, గొంతు భాగంలో తెగి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే బాలుడిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు వైద్యం చేసి 25 కుట్లు వేశారు. ప్రస్తుతం నిజామాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో శ్రీ హాన్ కు చికిత్స కొనసాగుతోంది.


