కలం, తెలంగాణ బ్యూరో : పార్టీని (Telangana Congress) బలోపేతం చేయడంలో కార్యకర్తలే ప్రాణమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తరచూ చెప్పే మాట. అందుకే వారిని ప్రాణసమానులు అని సంబోధిస్తూ ఉంటారు. పార్టీ కోసం సిన్సియర్‌గా పనిచేసేవారికి తప్పకుండా అవకాశాలు కల్పించాలని చెప్తూ ఉంటారు. జిల్లాల్లో డీసీసీ అధ్యక్షులే (DCC Presidents) పార్టీకి కీలకం అని రాహుల్‌గాంధీ సంస్థాగత సమావేశాల్లో పీసీసీ ప్రెసిడెంట్‌లకు ఎప్పుడూ చెప్పే మాట. కానీ తెలంగాణలో ఈ రెండూ అమలు కావడం లేదు. డీసీసీలను అటు మంత్రులు, ఇటు ఎమ్మెల్యేలు లెక్క చేయడంలేదని, పార్టీ ఇచ్చిన ఆదేశాలను కింది స్థాయికి వారి ద్వారా తీసుకెళ్ళే ప్రయత్నాలు ఫలించడంలేదని, సమన్వయం ఉండడం లేదని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు రెండు రోజుల క్రితం మొరపెట్టుకున్నారు. తొందరగానే కొలిక్కి తెస్తామంటూ వీరిద్దరూ హామీ ఇచ్చారు.
డీసీసీలతో మంత్రులు, ఎమ్మెల్యేలకు కొరవడిన సయోధ్య :
పార్టీ జిల్లా అధ్యక్షులతో ఆ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో చాలా చోట్ల సత్సంబంధాలు లేవనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఉదాహరణకు నల్లగొండ జిల్లానే తీసుకుంటే, డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేతకు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి (Minister Komatireddy) మధ్య చోటుచేసుకున్న భిన్నాభిప్రాయాలు, వివాదాలు ఇప్పటికే పార్టీ దృష్టికి వెళ్ళాయి. బీసీ సామాజికవర్గానికి చెందిన నేత డీసీసీ ప్రెసిడెంట్‌గా రావడాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని ఆ జిల్లా పార్టీ శ్రేణుల్లో ఓపెన్ డిస్కషన్ జరిగింది. ఇలాంటి అభిప్రాయాలే మరికొన్ని జిల్లాల్లో ఉన్నాయి. పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన టాస్క్‌ను సమర్ధవంతంగా అమలు చేయడంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాటించడంలేదని, యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయడంలేదనే ఆరోపణలు వచ్చాయి. వీటినే పార్టీ సంస్థాగత సమావేశంలో డీసీసీ అధ్యక్షులు లేవనెత్తారు. పార్టీ ప్రోగ్రామ్‌ను అమలు చేయడంలో స్థాయిలతో సంబంధం లేకుండా అందరూ పాల్గొనాల్సిందేననే సాధారణ నిబంధనను గుర్తుచేశారు.
పార్టీ, ప్రభుత్వానికి సైతం పెరుగుతున్న గ్యాప్ :
ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను జనంలో విస్తృతంగా ప్రచారం చేసుకోలేకపోతున్నామనేది అటు పార్టీ లీడర్లలో, మంత్రుల్లో బలంగానే ఉన్నది. ముఖ్యమంత్రి సైతం పలు సందర్భాల్లో దీన్ని ప్రస్తావించారు. మంత్రులు సైతం బహిరంగంగానే “చేసిన పనులను చెప్పుకోలేకపోతున్నాం.. ” అని వ్యాఖ్యానించారు. పార్టీ, ప్రభుత్వం సమాంతరంగా పనిచేయాలని, అప్పుడే ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్ళగలమని, వాటిని విస్తృతంగా ప్రచారం చేసుకోగలమన్నది ఉమ్మడి అభిప్రాయం. కానీ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ రావడంతో లక్ష్యం గాడి తప్పుతున్నది. దీన్ని భర్తీ చేయడం ఇప్పుడు రెండు పక్షాల లీడర్ల మీద పడింది. ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేండ్లు పూర్తికావస్తున్నది. రాబోయే కాలమంతా కీలకమనే భావనతో అటు పార్టీ (Telangana Congress) వ్యవహారాల ఇన్‌చార్జి, పీసీసీ చీఫ్, ఇటు ముఖ్యమంత్రి మొదలు మంత్రులు ఎలా వ్యవహరిస్తారన్నది కీలకంగా మారింది.
Read Also: రాహుల్ గాంధీ సంచలన పోస్ట్.. ‘ధరలు పెరగబోతున్నాయ్’
Follow Us On: WhatsApp

