Mobile Popup Ad
Mobile Popup Ad

పెద్దపల్లిలో అక్రమ మట్టి దందాపై బీఆర్ఎస్ ధర్నా

కలం, కరీంనగర్ బ్యూరో: పెద్దపల్లి(Peddapalli) నియోజకవర్గంలో అక్రమ మట్టి దందా, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తరుగు పేరుతో జరుగుతున్న దోపిడీపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన జరిగింది. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి (Dasari Manohar Reddy) నేతృత్వంలో బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం రాజీవ్ రహదారిపై బైఠాయించి రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించి, అక్రమ మట్టి రవాణాను వెంటనే అరికట్టాలని, కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉన్న ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన సేకరించాలని డిమాండ్ చేశారు.

మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో అక్రమ దందాలు పెరిగిపోయాయని ఆరోపించారు. ప్రజా పాలన పేరుతో కొంతమందికే లబ్ధి చేకూరుస్తూ రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారని విమర్శించారు. ఎండాకాలంలో గ్రామాల చెరువుల నుంచి ఇటుక బట్టీల కోసం మట్టి మాఫియా దందా జరుగుతోందని, అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. ఒకే రసీదుపై పదుల సంఖ్యలో లారీలు మట్టి తరలిస్తున్నాయని, భారీ ఓవర్‌లోడ్ వాహనాలతో గ్రామీణ రహదారులు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. ఇరిగేషన్, రెవెన్యూ, మైనింగ్, పంచాయతీరాజ్ శాఖలు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయని  విమర్శించారు. రవాణా శాఖ కూడా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నెలల తరబడి నిల్వ ఉండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, కాటా సమయంలోనే బస్తాకు అదనంగా కిలోల లెక్కన కోతలు పెడుతున్నారని, మిల్లుల వద్ద కూడా తరుగు పేరిట రైతులను దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, రైతులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్, పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజకుమార్, మాజీ జడ్పీటీసీ వంగలు తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ స్రవంతి మోహన్ రావు, మండల అధ్యక్షులు మార్క్ లక్ష్మణ్, ఐరెడ్డి వెంకటరెడ్డి, రామ్ రెడ్డి, pacs ఛైర్మెన్ సందీప్ రావు, సుల్తానాబాద్ పట్టణ అధ్యక్షుడు పారుపల్లి గుణపతి, కౌన్సిలర్ వెన్నం సుజాత రవీందర్, సర్పంచులు బోయిన్ లావణ్య శ్రీనివాస్, ఓజా సంపత్, BRS నాయకులు బోయిన్ రాజమల్లు, సలేంద్ర రాములు, ఈశ్వర్, పెంచల శ్రీధర్, మోబిన్, చంద్రశేఖర్, ఖదీర్ ఖాన్, కోయిడ సతీష్, మేడగోన శ్రీకాంత్ గౌడ్, కోయిడ శ్రీనివాస్, తీగల సదయ్య, దేవయ్య, ములుగురు అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>