epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

దానం, కడియం రాజీనామాలు తప్పవా?

కలం డెస్క్ : పార్టీ ఫిరాయింపు(Defection Case) వ్యవహారంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామా చేయవచ్చన్న వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆయనకు తోడు స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సైతం రాజీనామా చేయక తప్పదనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరిపైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు ఆరోపణలు చేయడంతో స్పీకర్ అనర్హత వేటు వేసే అవకాశమున్నది. అదే జరిగితే వారి కెరీర్‌పై మచ్చతో పాటు రాబోయే ఆరేండ్లు పోటీ చేయడానికి అవకాశం ఉండదు. దీన్ని పరిగణలోకి తీసుకుని స్పీకర్ నిర్ణయం తీసుకోడానికి ముందే రాజీనామాను సమర్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

దానం నాగేందర్‌పై ఆరోపణలేంటి?

ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ బీ-ఫామ్ మీద పోటీ చేసి గెలిచిన దానం నాగేందర్(Danam Nagender), ఆరు నెలల తర్వాత 2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసి ఓడిపోయారు. ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ మరో పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయడం పార్టీ మారారనేదానికి నిదర్శనమని పేర్కొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు పిర్యాదు చేసి అనర్హత వేటు వేయాల్సిందిగా కోరారు. దీనిపై విచారణ జరుగుతూ ఉన్నది. స్పీకర్ నోటీసు జారీచేసినా వివరణ ఇవ్వడానికి గడువు కావాలని కోరి గైర్హాజరయ్యారు. రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసి గెలిచి మంత్రివర్గంలో చేరాలని దానం నాగేందర్ ఉవ్విళ్ళూరుతున్నారు. టికెట్ ఇవ్వడం, క్యాబినెట్‌లో చోటు కల్పించడం ఏఐసీసీ పరిధిలోని అంశం కావడంతో ఇటీవల ఢిల్లీ వెళ్ళి పలువురు నేతలను కలిసి వచ్చారు.

ప్రపోజర్ సంతకంతో చిక్కులు :

స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ బీ-ఫామ్ మీద పోటీ చేసి గెలిచిన కడియం శ్రీహరి(Kadiyam Srihari) ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో ఆయన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్ టికెట్ మీద వరంగల్ (ఎస్సీ రిజర్వు) స్థానం నుంచి పోటీ చేస్తుంటే నామినేషన్ పత్రాల్లో ప్రపోజర్‌గా సంతకం చేశారు. మరో పార్టీకి చెందిన అభ్యర్థికి ప్రపోజర్‌గా వ్యవహరించడం పార్టీ ఫిరాయింపు(Defection Case) కిందకు వస్తుందని అసెంబ్లీ స్పీకర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసి అనర్హత వేటు వేయాలని కోరారు. దీంతో నవంబరు 23 లోగా విచారణకు రావాల్సిందిగా స్పీకర్ నోటీసు జారీచేసినా తగిన గడువు కావాలని కడియం కోరారు. స్పీకర్ స్పందన వచ్చిన తర్వాత కడియం రాజీనామాపై స్పష్టత రానున్నది. మరోవైపు ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నికలు తథ్యమనే భావనతో బీఆర్ఎస్ ఇప్పటి నుంచే గెలుపు కోసం వ్యూహం రచిస్తున్నది.

Read Also: గోల్ఫ్‌లో చరిత్ర సృష్టించిన ప్రణవి ఉర్స్

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>