ఆరోగ్యం, వసతులపై సమీక్ష: మంత్రి కీలక ఆదేశాలు!

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు, డెంగ్యూ, మలేరియా, చికెన్‌ గున్యా తదితర వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులు, వైద్య పరికరాలు, ఇతర మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Raja Narsimha) ఆదేశించారు.

సంగారెడ్డి కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో పాటు వివిధ శాఖల అధికారులతో కలిసి మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సంగారెడ్డి జిజిహెచ్ లో అవసరమైన ఎక్వి ఫ్మెంట్, మందులు అందుబాటులో ఉండాలని, నిరంతరం పర్యవేక్షించాలని జిజిహెచ్ సూపరింటెండెంట్ కు సూచించారు. కంకోల్, సింగితం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని, బర్దిపూర్, సుల్తాన్‌పూర్, నేరడిగుంట పీహెచ్ సి భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

సంగారెడ్డి నర్సింగ్ కళాశాల, పటాన్‌చెరు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, జహీరాబాద్ ఎంసిహెచ్ లనుత్వరలో ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశించారు. విద్యా రంగంలో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు.

కేజీబీవీ లు, మోడల్ స్కూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని మంత్రి ఆదేశించారు. పి హెచ్ సి లు,అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, కె జి బి విలు,మోడల్ స్కూళ్లు, జడ్ పి హెచ్ ఎస్ లలో తాగునీరు, డ్రైనేజీ, మరుగుదొడ్ల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన పనులను పూర్తి చేయాలని మంత్రి కలెక్టర్ కు సూచించారు.

జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించి విద్యార్థులు ఆహ్లాద వాతావరనంలో చదువు కునేలా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. హాస్టళ్లకు సంబంధించి ప్రస్తుతం అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

కొత్త రేషన్ కార్డుల జారీ అంశంపై మంత్రి సమీక్షస్తూ, ఈ నెల 15న ముఖ్యమంత్రి గౌ.రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో, కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

జిల్లాలో తాగునీటి సరఫరా పరిస్థితిపై మంత్రి సమీక్షిస్తు మంజీర, సింగూరు ప్రాజెక్టుల్లో ప్రస్తుత నీటి మట్టాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బోరంచ, భూసారెడ్డిపల్లి ఇంటెక్ వెల్‌ల ద్వారా జరుగుతున్న నీటి సరఫరాపై కూడా మంత్రి వివరాలు తెలుసుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>