అహ్మదాబాద్‌లో గర్జించిన గుజరాత్.. చిత్తయిన ఎస్ఆర్‌హెచ్

కలం, వెబ్ డెస్క్: అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. మొదట బ్యాటింగ్‌లో సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ మెరుపులు మెరిపించగా, తర్వాత బౌలింగ్‌లో కగిసో రబాడా, జేసన్ హోల్డర్ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లను వణికించారు. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ కేవలం 14.5 ఓవర్లలో 86 పరుగులకే చాపచుట్టేసింది. దీంతో గుజరాత్ 82 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు జోడించింది. ఓపెనర్ సాయి సుదర్శన్ 44 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 61 పరుగులు చేసి జట్టుకు గట్టి పునాది వేశాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (5), జోస్ బట్లర్ (7) త్వరగానే అవుటైనా, నిశాంత్ సింధు 14 బంతుల్లో 22 పరుగులతో వేగంగా ఆడాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్ ఆకాశమే హద్దుగా చెలరేగి 33 బంతుల్లోనే 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో సరిగ్గా 50 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను ముగించాడు. హైదరాబాద్ బౌలర్లలో ప్రఫుల్ హింగే (2/17), సాకిబ్ హుస్సేన్ (2/37) చెరో రెండు వికెట్లు తీయగా, పాట్ కమిన్స్ ఒక వికెట్ సాధించాడు.

169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆది నుంచే తడబడింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ సున్నాకే వెనుదిరగగా, అభిషేక్ శర్మ (6), ఇషాన్ కిషన్ (11) పెవిలియన్ చేరారు. రవిచంద్రన్ స్మరణ్ (9), హెన్రిచ్ క్లాసెన్ (14), సలిల్ అరోరా (16) కొద్దిసేపు నిలబడే ప్రయత్నం చేసినా వికెట్లు పడకుండా అడ్డుకోలేకపోయారు. చివర్లో కెప్టెన్ పాట్ కమిన్స్ 9 బంతుల్లోనే 19 పరుగులు (1 ఫోర్, 2 సిక్సర్లు) చేసి టాప్ స్కోరర్‌గా నిలిచినప్పటికీ, మిగిలిన వారు వరుసగా అవుట్ కావడంతో హైదరాబాద్ 14.5 ఓవర్లలో 86 పరుగులకే ఆలౌట్ అయింది.

గుజరాత్ బౌలర్లు నిప్పులు చెరిగే బౌలింగ్‌తో హైదరాబాద్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. జేసన్ హోల్డర్ 4 ఓవర్లలో కేవలం 20 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. కగిసో రబాడా కూడా 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రసిద్ధ కృష్ణ రెండు వికెట్లు తీయగా, మొహమ్మద్ సిరాజ్, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ తన హోంగ్రౌండ్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>