కలం, వరంగల్ బ్యూరో : జయశంకర్ భూపాలపల్లి(Jayashankar Bhupalpally) జిల్లా కాటారం మండల పరిధిలో వివాహేతర సంబంధం(Extramarital Affair) హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ.. భూపాలపల్లి జిల్లా న్యాయస్థానం గురువారం తుది తీర్పునిచ్చిందని ఎస్ పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. ఈ మేరకు ఆయన కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. కాటారం మండలం విలసాగర్ (Vilasagar) గ్రామానికి చెందిన నిందితుడు రాదండి రవి అదే గ్రామానికి చెందిన బోడ పూజ మధ్య కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ క్రమంలో నిందితుడు పూజ వద్ద నుండి సుమారు రూ.5 లక్షల నగదు, బంగారు ఆభరణాలు తీసుకున్నాడు. అనంతరం ఆమె వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో నిందితుడు ఆమెను హతమార్చాలని పథకం రచించాడు.
అందులో భాగంగా 2019 మార్చి13న రాత్రి సుమారు పది గంటల సమయంలో పూజ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన పూజను హాస్పిటల్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ హత్య కేసును పోలీసులు శాస్త్రీయంగా దర్యాప్తు చేసి పక్కా ఆధారాలతో చార్జ్‌షీట్ దాఖలు చేసారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎదులాపురం శ్రీనివాస్ సమర్థవంతంగా వాదనలు వినిపించడంతో నిందితుడికి శిక్ష ఖరారైంది. ఈ కేసులో నిందితుడు రాదండి రవిని దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం అతనికి జీవిత ఖైదీ కారాగార శిక్షతో పాటు రూ.10,500 జరిమానా విధించినట్లు ఎస్ పీ తెలిపారు. ఈ తీర్పుతో నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు తప్పవని చట్టం ముందు ఎవరూ తప్పించుకోలేరని ఆయన స్పష్టం చేశారు.


