కలం, కరీంనగర్ బ్యూరో: మైనర్ బాలికను వేధించి, అత్యాచారం చేసిన బండి భగీరథ్ కేసులో తన తండ్రి కేంద్ర మంత్రి బండి సంజయ్ అధికారంలో ఉండగా కేసు విచారణ ఎలా సాధ్యమని సీపీఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం (Gudikandula Satyam) ప్రశ్నించారు. సామాన్యుడు నేరం చేస్తే పోక్సో చట్టంలో సిట్ వేస్తారా? పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయమా అంటూ నిలదీశారు. నేరారోపణ ఉన్న తన కొడుకును కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ 9 రోజులు పోలీసులకు దొరకకుండా తన కొడుకును ఎందుకు కాపాడాడని, నేరం చేయనప్పుడు కోర్టు ముందు లొంగిపోయి విచారణ ఎదుర్కొనవచ్చు కదా? అని ప్రశ్నించారు.
సామాన్యుడి కొడుకు నేరం చేస్తే తన తల్లిదండ్రులను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చుండబెట్టి తన కొడుకు ఆచూకీ తెలపమంటూ వేధించే పోలీసు అధికారులు బండి సంజయ్ కొడుకు విషయంలో ఎందుకు వెనకాడారని ప్రశ్నించారు. ఇప్పటికీ బండి భగీరథ్ ఫోన్ స్వాధీనం చేసుకున్నప్పటికీ అందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు సిమ్ మాయం చేసి ఎక్కడో పోయాడని డొంక తిరుగుడు సమాధానాలు చెప్తున్నారని అన్నారు. బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవిగా ఉంటే బాధితురాలికి న్యాయం జరగదని, ఈ కేసు సజావుగా విచారణ కొనసాగదని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బండి సంజయ్‌ని మంత్రి పదవి నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

