కలం, ఖమ్మం బ్యూరో: అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలపై సీపీఎం (CPM) పార్టీ సమరశంఖం పూరించింది. పండించిన ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో సాగుతున్న దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem ) జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అన్నవరపు కనకయ్య, జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఒకవైపు అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులు, మరోవైపు మార్కెట్‌లో మద్దతు ధర రాక అల్లాడుతున్నారని మండిపడ్డారు.
మొక్కజొన్నను కేవలం రూ.1,700 లకే కొనుగోలు చేస్తూ రైతుల పొట్ట కొడుతున్నారని ఫైరయ్యారు. అధికారుల పర్యవేక్షణ శూన్యం కావడం వల్లే మిల్లర్లు, దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన ఎరువులు, విత్తనాల ధరలకు అనుగుణంగా మద్దతు ధర పెంచకపోగా, ఉన్న ధరను కూడా అమలు చేయకపోవడం దారుణమన్నారు. తేమ పేరుతో తరుగు తీయడం వల్ల రైతుకు శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదని ధ్వజమెత్తారు. జిల్లా యంత్రాంగం ఇప్పటికైనా స్పందించి, క్షేత్రస్థాయిలో కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించాలని సీపీఎం (CPM) డిమాండ్ చేసింది. రైతుల సమస్యలు పరిష్కారం కాకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సీపీఎం పార్టీ శ్రేణులు, రైతులు పాల్గొన్నారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో కలెక్టరేట్ పరిసరాలను మారుమ్రోగించారు.
Read Also: మోదీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు: పొన్నం ప్రభాకర్
Follow Us On : WhatsApp

