ప్రపంచకప్‌లో ప్రత్యర్థి ఎవరైనా తగ్గొద్దు: హర్మన్‌ప్రీత్

క‌లం, వెబ్‌డెస్క్‌: ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్ పోరు మొదలవుతున్న వేళ భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (Harmanpreet Singh) జట్టుకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. పూల్ D లోని ప్రతీ మ్యాచ్ తమకు ఎంతో కీలకమని, ఏ ప్రత్యర్థినీ తేలికగా తీసుకోకూడదని ఆయన స్పష్టం చేశారు. వరల్డ్‌కప్‌లో భారత్ ప్రాతినిధ్యం వహిస్తున్న పూల్ D లో వేల్స్, ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్లు ఉన్నాయి. గతంలోనే ఈ జట్లతో ఆడిన అనుభవం ఉండటంతో ప్రత్యర్థుల ఆటతీరుపై తమ కోచింగ్ సిబ్బంది, ఆటగాళ్ళు వీడియో విశ్లేషణలు పూర్తి చేసినట్లు హర్మన్‌ప్రీత్ తెలిపారు.

మెజారిటీ జట్లు మ్యాన్-టు-మ్యాన్ విధానంలో ఆడతాయని, పాకిస్థాన్ మాత్రం జోన్ మార్కింగ్, మ్యాన్-టు-మ్యాన్ విధానాలను కలిపి ఆడుతుందని వివరించారు. గతంలో ప్రో లీగ్‌లో పాకిస్థాన్‌తో, కామన్వెల్త్ గేమ్స్‌లో వేల్స్‌తో ఆడిన అనుభవాల ఆధారంగా లోపాలను దిద్దుకుని ముందుకు సాగుతున్నామని చెప్పారు. వరల్డ్‌కప్‌లో పాత విజయాలు ఉపయోగపడవని, ఒత్తిడి ఎక్కువగా ఉండే ఈ టోర్నీలో ప్రతీ మ్యాచ్‌నూ ఒక సవాలుగా భావించాల్సిందేనని వ్యాఖ్యానించారు.

ప్రతి ప్రత్యర్థికీ తగిన గౌరవం ఇస్తూ, ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా పాకిస్థాన్‌తో జరిగే పోరుపై అభిమానుల్లో ఎప్పుడూ ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఆ మ్యాచ్‌లో భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని హర్మన్‌ప్రీత్ వెల్లడించారు. గ్రౌండ్‌లో అనవసర ఆలోచనలు పక్కనపెట్టి ప్రశాంతమైన మనస్సుతో వ్యూహాలను అమలు చేయాలని జట్టుకు సూచించారు.

మైదానంలో స్టేడియం జనం ఇచ్చే ఉత్సాహాన్ని సానుకూలంగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు. శిక్షణలో నేర్చుకున్న పద్ధతులను, ఆట తీరును 60 నిమిషాల పాటు ఎక్కడా విడిచిపెట్టకుండా కచ్చితత్వంతో ఆడటమే తమ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. క్రమశిక్షణతో ఆడి విజయం సాధించడమే భారత్ లక్ష్యమని హర్మన్‌ప్రీత్ సింగ్ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>