కలం, యాదాద్రి భువనగిరి: నిరుద్యోగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేయడానికి కార్యాలయానికి వెళ్లగా.. ఆ సమయంలో అధికారులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో వినతిపత్రాన్ని కార్యాలయ గేటుకు అతికించారు. ఈ సందర్భంగా సిపిఐ(ఎం) పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు.
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఉన్న ఉద్యోగాలను కూడా తొలగిస్తూ యువతను ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి రెండేళ్లు గడిచినా ఇప్పటివరకు అమలు చేయలేకపోయిందని మాయ కృష్ణ అన్నారు. వెంటనే నిరుద్యోగ భృతి హామీని అమలు చేయాలని లేదా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలను అమలు చేయకపోతే నిరుద్యోగులను ఏకం చేసి దశలవారీగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్ష, కార్యదర్శులు వేముల నాగరాజు, లౌడియా రాజు, పట్టణ డీవైఎఫ్ఐ అధ్యక్ష, కార్యదర్శులు మేడబోయిన సుందర్, ఎండి సలీం, ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు నేహాల్, ఈర్ల రాహుల్, గర్ల్స్ కన్వీనర్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు సింధూర రాణి, ప్రసన్న, అరవింద్, జీవన్ తదితరులు పాల్గొన్నారు.

