Mobile Popup Ad
Mobile Popup Ad

అమెరికా యుద్ధోన్మాదంపై మోడీ మౌనం వీడాలి : సీపీఐ నేత డాక్టర్ కె. నారాయణ

కలం, వరంగల్ బ్యూరో : భారత దేశానికి నష్టం కలిగిస్తున్న అమెరికా (America) యుద్ధోన్మాదంపై ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) మౌనం వీడాలని సీపీఐ (CPI) జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె. నారాయణ (Kankanala Narayana) డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండ(Hanumakonda) బాలసముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధ కాంక్షతో అనేక దేశాలు ప్రభావితమవుతున్నాయని అన్నారు. దీనివల్ల ఇంధన సరఫరా ఇబ్బందులు తలెత్తడంతో పాటు భారతదేశ రైతుల ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, బియ్యం వంటి వస్తువుల ఎగుమతులు నిలిచిపోయాయని పేర్కొన్నారు.

యుద్ధ ప్రభావంతో దేశంలో ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దేశ ఔన్నత్యాన్ని కాపాడాలంటే మోడీ వెంటనే స్పందించాలని అన్నారు. యుద్ధం చేస్తున్న దేశాలతో చర్చలు జరపకుండా, యుద్ధంతో నష్టపోతున్న ఇరాన్‌తో మాత్రమే మాట్లాడటం సరైంది కాదని విమర్శించారు. అమెరికాలోనే ట్రంప్‌కు వ్యతిరేకంగా భారీ నిరసనలు జరుగుతున్నప్పటికీ, మోడీ బలహీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో అసత్యాలు మాట్లాడారని, కమ్యూనిస్టులు, మావోయిస్టులపై అనవసర విమర్శలు చేశారని మండిపడ్డారు.

నక్సలైట్ ఉద్యమం నుంచి బయటకు వచ్చిన గద్దర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ప్రశ్నిస్తూ, అదే గద్దర్ మరణించినప్పుడు ప్రధాని మోడీ సంతాపం తెలిపిన విషయాన్ని ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్‌కౌంటర్ల ద్వారా మావోయిస్టులను హతమార్చడం దుర్మార్గమని ఆరోపించారు. లొంగిపోయిన మావోయిస్టులకు సరైన గౌరవం, స్వేచ్ఛ ఇవ్వడం లేదని విమర్శించారు. ఇటీవల క్రైస్తవ మతంలో చేరితే ఎస్సీ హోదా రద్దవుతుందనే తీర్పు సరికాదని, మతం మారినా కులం మారదని స్పష్టం చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఎస్ఐఆర్‌ను వ్యతిరేకిస్తున్నామని, ఇది ఫెడరల్ వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నమని అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, రాష్ట్ర నాయకులు నేదునూరి జ్యోతి, అదరి శ్రీనివాస్, సిరబోయిన కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>