కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు (Manuguru) లోని సింగరేణి (Singareni) పీకే ఓసీ 2 బొగ్గు గనిలో 100 ఫిట్నెస్ లేని డంపర్లు ఉన్నాయని మైన్స్ సేఫ్టీ డిప్యూటీ డైరెక్టర్ దిలీప్ కుమార్ తెలిపారు. సింగరేణిలో వరుస ప్రమాదాల నేపథ్యంలో శుక్రవారం ఆయన రక్షణ, తనిఖీ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా 100 డంపర్లకు ఫిట్నెస్ సర్టిఫికెట్స్ లేవనీ, కేవలం 35 వాహనాలకు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. గత ఆదివారం డంపర్ టైరు పేలి ఒక ఓబీ వర్కర్ చనిపోయిన నేపథ్యంలో, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఇందుకోసం కోసం అనుక్షణం కార్మికులను, సూపర్వైజర్లను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే కార్మికులు వ్యక్తి గత రక్షణ పరికరాలను ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పని ప్రదేశాల్లో హాల్ రోడ్స్, లైటింగ్, వాటర్ స్ప్రేయింగ్ వంటి చర్యలు తీసుకుంటే ప్రమాదాలు నివారించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సింగరేణి (Singareni) యాజమాన్యానికి కూడా పలు ఆదేశాలు జారీ చేశారు. వీటిని కోల్ మైన్స్ రెగ్యులేషన్ 2017 నిబంధనల ప్రకారం ప్రతి రోజు క్రమం తప్పకుండా పాటించాలని మైన్స్ సేఫ్టీ డిప్యూటీ డైరెక్టర్ దిలీప్ కుమార్ వివరించారు.

