కలం, వెబ్‌డెస్క్: CPI Narayana | ఇండిగో విమాన సర్వీసుల్లో అంతరాయంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. గత ఐదు రోజులుగా ఇండిగో ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు. దేశీయ విమాన సర్వీసులు ఒక్కసారిగా నిలిచిపోవడం, వందల సంఖ్యలో విమానాలు రద్దు కావడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
శనివారం కూడా పరిస్థితి మారలేదు. దేశవ్యాప్తంగా పలు ఎయిర్‌పోర్టుల్లో ఇండిగో(Indigo)కు చెందిన దాదాపు 500కు పైగా విమానాలు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ప్రత్యామ్నాయ విమాన టికెట్లు దొరకక, హోటల్ ఖర్చులు, పనులను కోల్పోవడం వంటి ఇబ్బందులతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఇండిగో సమస్యకు సీపీఐ నేత నారాయణ (CPI Narayana) తనదైన శైలిలో ఓ పరిష్కారం సూచించారు. ప్రజా ప్రయోజనాలు దెబ్బతిన్నప్పుడు ప్రభుత్వం తప్పనిసరిగా జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఇండిగో నిర్వహణను కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా స్వాధీనం చేసుకుని సర్వీసులను సవ్యంగా నడపాలని సూచించారు. మరి నారాయణ చేసిన సూచన గురించి ప్రభుత్వం ఆలోచిస్తుందా? ప్రభుత్వం ఒక వేళ ఇండిగో నిర్వహణ బాధ్యతను తన చేతుల్లోకి తీసుకుంటే ఈ సమస్యకు పరిష్కారం దక్కుతుందా అన్నది వేచి చూడాలి.
ఇక ఇండిగో సమస్యకు అసలు కారణం ఏమిటి? అంతరాయాల గురించి స్పష్టమైన వివరణ ఏదీ బయటకు రావడం లేదు. విమానయాన నియంత్రణ సంస్థలు, కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని సమస్యను పరిష్కారించాలని ప్రయాణికులు మొత్తుకుంటున్నారు.
Read Also: కర్ణాటకలో తెలుగు బోర్డుల వివాదం.. రేవంత్ స్పందిస్తారా..?
Follow Us On : Facebook


