కలం, ఖమ్మం బ్యూరో : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వైఖరిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni Sambasiva Rao) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ పరిధిలోని ఏడూళ్లబయ్యారంలో ఘనంగా ప్రారంభమైన ‘ప్రజా చైతన్య యాత్ర’ సందర్భంగా ఆయన మాట్లాడారు.
కమ్యూనిస్టులను చిన్న మొక్కే కదా అని తేలిగ్గా తీసుకుని అణచివేయాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, “పీక కోస్తాం” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో పొత్తు ఉన్నంత మాత్రాన పాలనాపరమైన తప్పిదాలను ప్రశ్నించకుండా మౌనంగా ఉండబోమని కూనంనేని స్పష్టం చేశారు. ఓట్ల కోసం కమ్యూనిస్టులను వాడుకుని, అధికారం వచ్చాక నిర్లక్ష్యం చేస్తే కాంగ్రెస్‌కు కూడా గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని కూనంనేని (MLA Kunamneni Sambasiva Rao) హెచ్చరించారు.
హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీ నిర్మించడం సరికాదనడం లేదని, అయితే రాష్ట్రంలో ఇళ్లు లేని పేదల ఇందిరమ్మ ఇళ్ల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. బాధితులకు వెంటనే ఇళ్ల బిల్లులు మంజూరు చేయాలని, పొడు భూములకు పట్టాలివ్వాలని, సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను స్థానిక అవసరాలు తీర్చాకే ఇతర జిల్లాలకు తరలించాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై కూడా ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు.
దేశంలో దొంగల రాజ్యం సాగుతోందని, కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను కారుచౌకగా దోచిపెడుతున్నారని ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజీ, నిరుద్యోగం, నిత్యావసరాల ధరల పెంపుపై పోరాటాలు సాగిస్తామని చెప్పారు. సింగరేణి మనుగడ కోసం, ఓసి 2 డిప్ సైడ్ బొగ్గు బ్లాక్ సాధన కోసం ఏఐటీయూసీతో కలిసి పోరాడినట్లే ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.
Also Read : గుజరాత్‌లో మిస్టరీ బావి.. కదులుతున్న నీరు!
Follow Us On : WhatsApp

