సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి: బృంగి బాలకిషన్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఎన్నికల సంఘంలో విభేదాలు బయటపడడం ఆందోళనకరమని, ఏకపక్ష నిర్ణయాలతో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్న సీఈసీ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని సీపీఐ మహబూబ్ నగర్ జిల్లా కార్యదర్శి బృంగి బాల కిషన్ డిమాండ్ చేశారు.

ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో శనివారం మహబూబ్ నగర్ (Mahabubnagar) పట్టణంలోని స్థానిక బస్టాండ్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని ఇచ్చి నిరసన వ్యక్తం (CPI Protest) చేశారు. ఎన్నికల సంఘం స్వతంత్రత, పారదర్శకతపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, ఎన్నికల సంఘంలోని ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి పలు కీలక నిర్ణయాలపై రికార్డులో అభ్యంతరాలు వ్యక్తం చేశారన్న వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని బాలకిషన్ అన్నారు.

దేశంలో రాజ్యాంగ బద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘంలో కలహాలు రావడం, దేశ ప్రజలకు ఎదురవుతున్న ప్రశ్నలకు ఎన్నికల సంఘం సమాధానం ఇవ్వాలన్నారు. ఎన్నికల మీద ప్రజలు విశ్వాసం కోల్పోతే ప్రజాస్వామ్యానికి మంచిది కాదని విమర్శించారు. ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల పేర్ల తొలగింపు, ఎన్నికల డేటా నిర్వహణ వంటి కీలక అంశాలపై ఇద్దరు కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వచ్చిన వార్తలకు ఎన్నికల సంఘం స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘంలోనే కీలక నిర్ణయాలపై సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు బయటకు రావడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తోందన్నారు. ఎన్నికల సంఘం రాజకీయాలకు అతీతంగా, పూర్తిగా స్వతంత్రంగా, పారదర్శకంగా పనిచేస్తుందనే విశ్వాసాన్ని ప్రజల్లో మరింత బలపరచాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉందన్నారు.

ఎన్నికల సంఘం మాత్రం భిన్నాభిప్రాయాలు, అంతర్గత పరిశీలనలు, బహుళ సభ్యుల రాజ్యాంగ సంస్థలో సాధారణ ప్రక్రియలో భాగమేనని, తుది నిర్ణయాలు ఏకగ్రీవంగానే జరిగాయని పేర్కొన్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అయితే, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు లేవనెత్తిన అంశాలపై ప్రజలకు పూర్తి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి, ఎన్నికల సంఘంపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని బాలకిషన్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొండపల్లి రాము, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సి. రాజు, జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ , సీపీఐ నాయకులు సత్యనారాయణ రెడ్డి, బాషా, నరహరి, బసవరాజ్, రాజశేఖర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>