Mobile Popup Ad
Mobile Popup Ad

ఎన్నికల ముగింపు కానుక: పెట్రోల్ ధరల పెంపుపై మంత్రి ఫైర్‌

కలం, వెబ్‌ డెస్క్ : దేశంలో నాలుగు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి దేశ ప్రజలను మోసం చేసిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొత్త ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారాలు కూడా పూర్తి కాకముందే దేశ ప్రజలతో పాటు ముఖ్యంగా తెలంగాణ ప్రజలపై ఈ అదనపు భారాన్ని మోపి కేంద్రం మరోసారి అన్యాయం చేసిందని ఆయన మండిపడ్డారు.

గతంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి బీజేపీ అగ్రనేతలు పెట్రోల్ ధరలు పెరగవంటూ పలుమార్లు ప్రెస్ కాన్ఫరెన్స్‌లు పెట్టి మరీ ప్రగల్భాలు పలికారని మంత్రి గుర్తు చేశారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలను వంచించడమేనన్నారు. గతంలో యూపీఏ ప్రభుత్వం నయాపైసా ధర పెంచకముందే, అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా అపహాస్యం చేస్తూ మాట్లాడిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

మూడు రోజుల క్రితం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఒక కేంద్ర పెద్ద.. పెట్రోల్, డీజిల్ తక్కువ వాడాలని, బంగారం కొనవద్దని, నూనె వాడకం తగ్గించాలని పిలుపునిచ్చినప్పుడే సామాన్యుల నడ్డి విరవబోతున్నారనే అనుమానం మాకు కలిగిందని మంత్రి వ్యాఖ్యానించారు. దేశంలో ఆరు నెలలకు సరిపడా స్టాక్ ఉందని చెబుతూనే, అంతర్జాతీయ యుద్ధ కారణాలను సాకుగా చూపడం హాస్యాస్పదంగా ఉందన్నారు. యుద్ధం ఈరోజు కొత్తగా వచ్చింది కాదని, చాలా కాలంగా సాగుతున్నా కేవలం ఎన్నికల కోసమే ధరల పెంపును ఇన్నాళ్లూ తొక్కిపెట్టారని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ప్రజావ్యతిరేక నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన తామంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నట్లు పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై తెలంగాణ బీజేపీ నేతలు తక్షణమే స్పందించి, ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెబుతూ ముక్కు నేలకు రాయాలని ఆయన డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>