డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అర్హులకు ఎందుకు ఇవ్వరు.. సీపీఐ ఫైర్

కలం, కరీంనగర్ బ్యూరో: డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పేదలకు ఎందుకు ఇవ్వడం లేదని పంజాల శ్రీనివాస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో అర్హులైన పేదలకు ఇవ్వడం కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేదలకు ఇవ్వడం లేదని విమర్శించిన కాంగ్రెస్, ఇప్పుడు నిర్మించి ఉన్న ఆ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అధికారంలో ఉండి కూడా పేదలకు ఎందుకు ఇవ్వడం లేదని సీపీఐ (CPI) జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ (Panjala Srinivas) కాంగ్రెస్ ప్రభుత్వానికి సూటి ప్రశ్న వేశారు.

గురువారం సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో తీగలగుట్టపల్లిలో నిర్మించి ఉన్న ఇండిపెండెంట్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల చుట్టూ ఉన్న చెట్లను తొలగించి, గడ్డిని, చెత్తను తీసివేయడానికి, ఇండ్ల చుట్టూ అంతా చదును చేసి ఆక్రమించుకోవడానికి అర్హులైన పేదలను వెంట తీసుకెళ్లి ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇండ్లల్లోకి చొచ్చుకెళుతున్న సీపీఐ నేతలను, పేదలను పోలీసులు అరెస్ట్ చేసి కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. పాలకులు ఎవరైనా ప్రజా సంక్షేమం కోసం పనిచేసే క్రమంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అర్హులైన పేదలకు సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రజల సొమ్ముతో తీగలగుట్టపల్లి ఇండిపెండెంట్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించారని, అవి నిర్మించి ఏండ్లు గడుస్తున్నా పేదలకు మాత్రం కేటాయించడం లేదని మండిపడ్డారు.

ఆ ఇండ్లను పేదలకు ఇవ్వాలని గతంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏండ్లు గడుస్తున్నా నేటికి ఆ ఇండ్లు పేదలకు కేటాయించకపోవడంలో ఆంతర్యం ఏముందో అర్థం కావడం లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అని చూస్తున్నారా లేక పేదలకు ఇస్తే మాకేం వస్తుందని ఆలోచిస్తున్నారా? ఇప్పటికైనా రాజకీయ లబ్ధి కోసం ఆలోచించకుండా పేదలకు ఇస్తే వారు సంతోషిస్తారని శ్రీనివాస్ అన్నారు.

చింతకుంటలో కూడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఉన్నాయని, వాటిని అర్హులైన పేదలకు పంపిణీ చేయలేదని అన్నారు. నిర్మించిన ఇండ్లు నిరుపయోగంగా ఉండడంతో అవి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తీగలగుట్టపల్లి అయితే ఇండిపెండెంట్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మద్యం బాటిళ్లు, పేకాట కార్డులు ఉన్నాయని , పేదలకు చెందాల్సిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేకాటకు, మద్యం సేవించడానికి, క్షుద్ర పూజలకు నిలయాలుగా మారాయని విమర్శించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వెచ్చించి ఇండ్లను నిర్మిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఇండ్లను అసాంఘిక శక్తుల చేతుల్లో పెట్టినట్లుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసాంఘిక కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి ప్రభుత్వమే అనుమతించినట్లుగా ఉందని శ్రీనివాస్ విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి తీగలగుట్ట పల్లిలో, చింతకుంటలో నిర్మించి ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన పేదలందరికీ పంపిణీ చేయాలని కోరారు. లేని పక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో పేదలచే ఆక్రమించడానికి వెనకడుగు వేయమని శ్రీనివాస్ (Panjala Srinivas) హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ కరీంనగర్ కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు బిర్ల పద్మ, కొట్టె అంజలి, సీపీఐ శాఖ కార్యదర్శులు చెంచల మురళి, కసిబొజుల సంతోష్ చారి, కాల్వ శ్రీనివాస్ యాదవ్, అల్లేపు రాజు, ఓర్సు కొమురయ్య, నాయకులు మ్యాకల రమ్య, బీర్ల స్వాతి, రజిత, రమ, లక్ష్మీ, మల్లిక, ప్రియ తదితరులు పాల్గొన్నారు.

Read Also: బిగ్ అప్డేట్ : జమిలి ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>