కలం, వెబ్ డెస్క్: ఏపీలో ఉద్యోగ పెన్షన్దారులకు (Pension Rules) సంబంధించిన నిబంధనల్లో కీలక సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఉద్యోగి ఏదైనా అక్రమాలకు పాల్పడటం లేదా విధుల్లో నిర్లక్ష్యం లాంటి ఆరోపణలు వచ్చినప్పుడు, విచారణలో అది నిజమని తేలితే రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్, గ్రాట్యుటీ నిలుపుదల చేసేది.
తాజాగా సవరించిన నిబంధనల ప్రకారం, ఇక నుంచి ప్రభుత్వం ఏకపక్షంగా పెన్షన్, గ్రాట్యుటీ నిలిపివేయడానికి అవకాశం ఉండదు. కచ్చితంగా ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను సంప్రదించి, అభిప్రాయం తీసుకున్నాకే నిలిపివేయాల్సి ఉంటుంది. ఈ మేరకు పెన్షన్ రూల్స్–1980లోని రూల్ 9(1)కు సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కోర్ట్ శిక్ష పడితే…
ఉద్యోగి విధుల్లో ఉన్న కాలంలో అక్రమాలు, నిర్లక్ష్యానికి పాల్పడినట్లు కోర్టులు సైతం ధ్రువీకరించి.. శిక్ష విధించినప్పుడు మాత్రం ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే సదరు ఉద్యోగికి సంబంధించిన పెన్షన్, గ్రాట్యుటీ నిలిపేయొచ్చు. ఉద్యోగుల ప్రాథమిక హక్కులను కాపాడటంతో పాటు ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాన్ని తగ్గించి.. సమన్యాయం అందించే ప్రక్రియలో భాగంగా తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో.. పెన్షన్ దారులకు కొంత ఊరట కలిగినట్లయింది.
.

