కలం, వెబ్ డెస్క్: గోదావరి నదిలోని ప్రతి నీటి బొట్టును రాష్ట్ర రైతాంగానికి వినియోగించాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు, సీతమ్మసాగర్ ప్రాజెక్టులను మంత్రులు ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరిశీలన అనంతరం అధికారులతో ప్రాజెక్టు పురోగతిపై మీటింగ్ నిర్వహించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ.. గోదావరి నీళ్లను అన్నివ్యవస్థల ద్వారా పూర్తిగా వినియోగించుకునేందుకు మంత్రి ఉత్తమ్ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారని చెప్పారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగుతోందని చెప్పారు.
ఇటీవలే దేవాదుల ప్రాజెక్టును సమీక్షించి సమ్మక్క బ్యారేజ్ బ్యాక్‌వాటర్ నుంచి గరిష్ట స్థాయిలో నీటిని ఎత్తిపోసేలా చర్యలు తీసుకున్నామన్నారు. 22 రిజర్వాయర్లను నింపి, దాదాపు 12 జిల్లాలు, 17 అసెంబ్లీ నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈరోజు సీతారామ ప్రాజెక్టును సమీక్షించి పెండింగ్ పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రెండు ప్రాజెక్టులను రీడిజైన్ చేసి సీతారామ ప్రాజెక్టుగా మార్చిందని చెప్పారు. ఫలితంగా రూ.3,505 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టు వ్యయం దాదాపు రూ.24 వేల కోట్లకు పెరిగిందని మండిపడ్డారు.నిధుల కొరత కారణంగా ఒక్క పని కూడా ఆలస్యం కాకుండా నిధులు సమకూర్చి సీతారామ ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. గోదావరి జలాలను ప్రతి అర్హమైన ఆయకట్టుకు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా సాధ్యమైనంత ఎక్కువ నీటిని వినియోగంలోకి తీసుకువచ్చి, రైతుల కలలను సాకారం చేస్తామని అన్నారు.

