కలం, కరీంనగర్ బ్యూరో : లాభదాయకంగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్గో(RTC Cargo) సేవలను ప్రైవేటీకరించే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ‘పంజాల శ్రీనివాస్'(Panjala Srinivas) డిమాండ్ చేశారు. లేదంటే సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఆర్టీసీ నష్టాలను తగ్గించేందుకు గత ప్రభుత్వం కార్గో సేవలను ప్రారంభించగా, వాటి ద్వారా సంస్థకు గణనీయమైన ఆదాయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కార్గో సేవల ద్వారా ఏటా రూ.100 నుంచి రూ.120 కోట్ల వరకు ఆదాయం వస్తోందని, అలాంటి విభాగాన్ని ప్రైవేటు సంస్థకు అప్పగించాలనే నిర్ణయం సరికాదని విమర్శించారు.
గతంలో జరిగిన టెండర్ ప్రక్రియలో రూ.35 కోట్లకే ఒక ప్రైవేటు సంస్థకు బాధ్యతలు అప్పగించడం అవినీతికి నిదర్శనమని ఆరోపించారు. ఆర్టీసీని కాపాడాల్సిన వారే సంస్థను నష్టాలలో ఉన్నట్లు చూపించి ప్రైవేటీకరణకు (Privatization) కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. ఆగస్టు 1 నుంచి కొత్త ఒప్పందం అమలులోకి వచ్చే అవకాశం ఉందని, దీంతో కార్గో సేవలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న 500 మందికి పైగా హమాలీల ఉపాధి ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్గో ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకుంటే సిపిఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

