కలం, నిర్మల్ : ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ప్రతి బుధవారం బైంసా (Bhainsa) పట్టణంలో గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. బుధవారం బైంసా పట్టణంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎస్పీ, సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
గత గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కార స్థితి, ఇంకా పెండింగ్‌లో ఉన్న సమస్యల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకొని వాటిని వేగంగా పరిష్కరించాలని సూచించారు. కుటుంబ కలహాలకు సంబంధించిన ఫిర్యాదులపై షీ టీం సిబ్బంది ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించి కుటుంబాలను మళ్లీ ఒక్కటి చేసినట్లు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని ఎస్పీ జానకి షర్మిల స్పష్టం చేశారు.

