కలం, కరీంనగర్ బ్యూరో: లక్షల గొంతుకలు ఒకటై పోరాడి హక్కులను సాధించుకున్న రోజే మే డే అని, మే డే స్ఫూర్తితో కార్మిక లోకం పోరాటాలకు సిద్ధం కావాలని, బీజేపీ కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ (Panjala Srinivas) పిలుపునిచ్చారు. మే డే పురస్కరించుకొని శుక్రవారం కరీంనగర్ మండలంలోని చామనపల్లి గ్రామంలో హమాలీ కార్మికులు ఏర్పాటు చేసిన మేడే జెండాను సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ఎగరవేశారు. కరీంనగర్ మండలంలోని నగునూరు, బొమ్మకల్, జూబ్లీ నగర్, దుర్షేడు, మొగ్దూంపూర్, చేగుర్తి తదితర గ్రామాల్లో జెండాలు ఎగరవేయడం జరిగింది. అనంతరం చామనపల్లి గ్రామంలో జరిగిన సభకు జిల్లా కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. 1886 సంవత్సరం అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు చిందించిన రక్తం వృధా కాలేదని ఆ పోరాట ఫలితమే నేడు కార్మికులు అనుభవిస్తున్న హక్కులని ఆయన (Panjala Srinivas) అన్నారు. పెట్టుబడి దారి వర్గాల అణచివేతను వ్యతిరేకించి శ్రమశక్తి విలువను ప్రపంచానికి చాటి చెప్పిన రోజు మేడే అని కొనియాడారు. మోడీ పాలనలో కార్మిక హక్కులను హరించడం, పని గంటల పెంపు, శ్రమ జీవుల వ్యతిరేక విధానాలతో సాగుతుందని దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న హక్కులను లేబర్ కోడ్స్ తో తొలగించబడ్డాయని అన్నారు. కార్పొరేట్ అనుకూల నిర్ణయాలతో యూనియన్ల రద్దు సహా పలు కీలక నిర్ణయాలు కార్మికులకు వ్యతిరేకంగా తీసుకున్నదని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం 12 గంటల పని విధానం తెర పైకి తీసుకువచ్చి 100 సంవత్సరాల క్రితం ఎనిమిది గంటల పని దినాల కోసం పోరాటం చేసి సాధించుకున్న హక్కులను కాలరాస్తుందన్నారు.
మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలను అమలు చేస్తుందన్నారు. పరిశ్రమలు, గనులు, రవాణా, టెలిగ్రామ్,బ్యాంకులు,ఎల్ఐసి కంపెనీలు ఆఖరికి దేశ రక్షణ కోసం అహర్నిశలు పనిచేసే డిఫెన్స్ (రక్షణ) కంపెనీలు ల్యాబ్ లు, ఇస్రో లాంటి ప్రతిష్టాత్మకమైన పరిశోధన సంస్థలను అంబానీ,ఆధాని లాంటి బడా పెట్టుబడిదారులకు కారు చౌకగా కట్టబెడుతుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కార్మికలోకం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి, కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, చామనపల్లి సర్పంచ్ భోగండ ఐలయ్య, ఉప సర్పంచ్ దూడం శ్రీనివాస్ హమాలి కార్మిక నేతలు మెరుగు కొమరయ్య, ముదిగంటి పెద్దిరాజు, భూసారపు ప్రవీణు పెరుమాళ్ళ తిరుపతి,దావు మల్లారెడ్డి, నారాయణరెడ్డి, రాములు నాంపల్లి, భూసారపు భూమయ్య, భూసారపు ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Also: ప్రయాణికులకు అలర్ట్.. 40 రైళ్లు దారి మళ్లింపు
Follow Us On: X(Twitter)

