కలం, వెబ్ డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నది మహోగ్రరూపం (Godavari Floods) దాల్చింది. ఎగువన భారీగా వరద పోటెత్తడంతో భద్రాచలం వద్ద గురువారం 30 అడుగుల నీటిమట్టం ఉండగా.. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు 53 అడుగులకు చేరుకుంది. ఈ తరుణంలో అధికారులు మూడవ ప్రమాద హెచ్చరిక (Third Danger Warning) జారీ చేశారు. శనివారం ఉదయానికి 55.1 అడుగుల నీటి మట్టం ఉంది. ఈ మేరకు ఎప్పటికప్పుడు కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్రిజ్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. లోతట్టు ప్రాంతవాసులను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలించాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు.
వరద నీటిమట్టం పెరగటంతో దుమ్ముగూడెం-భద్రాచలం మధ్య శుక్రవారం సాయంత్రం నుంచి రాకపోకలు నిలిచిపోనున్నాయి. అటు దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల వద్ద స్నానఘట్టాలు నీట మునిగాయి. సీతవాగు వద్ద సీతమ్మ నారచీరలు, స్వామివారి సింహాసనం, ఐరన్ ఫుట్ బ్రిడ్జి నీటమునిగాయి. చర్ల మండలంలోని వీరాపురం శివారు ఇసుక క్వారీలో దాదాపు 44 మంది లారీ డ్రైవర్లతోపాటు స్థానికులు చిక్కుకుపోయారు. రెస్క్యూ టీం వీరిని రక్షించి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. నదిలో30కు పైగా లారీలు క్వారీలోనే ఉన్నాయి.

