కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ నగరంలో నివసిస్తున్న నిరుపేదలందరికీ వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం రోజున సీపీఐ కరీంనగర్ నగర శాఖ కార్యదర్శుల సమావేశం పైడిపల్లి రాజు అధ్యక్షతన బద్ద ఎల్లారెడ్డి భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. కరీంనగర్ నగరంలో కొన్ని సంవత్సరాల నుండి ఇండ్లు లేక చాలామంది ప్రజలు కిరాయిలలో ఉంటూ తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారని ఇంటి కిరాయి లు కట్టలేక నానా అవస్థలు పడుతూ ప్రాణాలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు కావస్తున్న నేటికీ పేదవాడికి ఉండడానికి ఇల్లు లేక, నివసించడానికి జాగలేక దుర్భర జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వడంలో తీవ్రంగా విఫలమైందని విమర్శించారు. దాదాపు పది సంవత్సరాల కాలంగా చింతకుంటలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించారని వాటిని నేటికీ పేద ప్రజలకు పంచకపోవడం చూస్తుంటే పేదల పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలొ స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంచుతామని ఇప్పుడు అప్పుడు అంటూ కాలయాపన చేశారు తప్ప పేదలకు పంచలేదని ఆరోపించారు.
ప్రభుత్వ ప్రజా వ్యతిరేకవిధానాలను ఎండగట్టేందుకు, నిర్మాణo అయిన డబుల్ బెడ్ రూములు వెంటనే అర్హులైన నిరుపేదలకు ఇవ్వాలని ఈనెల 22 సోమవారం రోజున కలెక్టర్ కార్యాలయం ముందు ఇల్లు లేని నిరుపేదలచే ధర్నా కార్యక్రమం చేస్తున్నామని చెప్పారు. దీనికి పేద ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పంజాల శ్రీనివాస్ నగర ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు న్యాలపట్ల రాజు, కౌన్సిల్ సభ్యులు బీర్ల పద్మ,నలవాల సదానందం శాఖ కార్యదర్సు లు గామినేని సత్యం, బాకం అంజనేయులు, సాయ వేణి రాజమల్లు, కాల్వ శ్రీనివాస్, కాల్వ కొమురయ్య, నునావత్ శ్రీనివాస్, నగునురి రమేష్, అల్లెపు రాజు, తంగేళ్ల సంపత్, తంగేళ్ల సదయ్య, బోయిని విష్ణు తదితరులు పాల్గొన్నారు.

