కలం, ఖమ్మం బ్యూరో: జిల్లాలో తుపాను వల్ల పంట నష్టపోయి (Cyclone Crop Damage), సర్వం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న అన్నదాతలను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఆర్థికంగా ఆదుకోవాలని సీపీఐ (CPI) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే. సాబీర్ పాషా డిమాండ్ చేశారు. గురువారం సుజాతనగర్ మండల పరిధిలో తుఫాను ప్రభావంతో ముంపునకు గురై దెబ్బతిన్న వరి, పత్తి, మిరప, మొక్కజొన్న తోటలను సీపీఐ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది.
పొలాల్లోకి దిగి నీటమునిగిన పైర్లను పరిశీలించిన నాయకులు, బాధిత రైతులతో నేరుగా మాట్లాడి నష్టాల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ.. ఇప్పటికే ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొన్న రైతులు, అరకొర నీటి వనరులతో ఎంతో శ్రమకోర్చి పంటలు సాగు చేస్తే ఈ తుఫాను వారిని మరింత నష్టాల ఊబిలోకి నెట్టివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరో వారంలో చేతికందే దశలో ఉన్న వేలాది ఎకరాల వరి పంట అకాల తుఫానుతో నీటిపాలై మొలకలు వచ్చే దుస్థితి దాపురించిందన్నారు.
కాయల దశలో ఉన్న పత్తి చేలల్లోకి నీరు చేరి కుళ్లిపోయి నల్లబడగా, మిరపలో వేరుకుళ్లు, కొమ్మకుళ్లు తెగుళ్లు ఆశించి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ములకలపల్లి, దమ్మపేట పరిసరాల్లోని ఆయిల్ పామ్, ఉద్యానవన తోటల్లోకి వాగుల వరద చేరి కోతలకు, రవాణాకు తీవ్ర ఆటంకం కలిగిందని తెలిపారు. అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించి నివేదికలను ప్రభుత్వానికి పంపాలని కోరారు. ఎకరా వరి, మొక్కజొన్న పంటలకు రూ.40 వేలు, మిరప, పత్తికి రూ.50 వేలు, ఉద్యాన పంటలకు రూ.30 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించి పూర్తి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
అన్నదాతలు గుండె నిబ్బరం కోల్పోవద్దని, రైతులు అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. రైతులకు నష్టపరిహారం అందే వరకు సీపీఐ పక్షాన ప్రభుత్వాలపై పోరాడి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, ఏఐకేఎస్, బికేయంయు నాయకులు సలిగంటి శ్రీనివాస్, భూక్య దస్రు, కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, తాళ్లూరి ధర్మారావు, కొమారి హన్మంతరావు, జక్కుల రాములు, భూక్య శ్రీను, ప్రతాప్ సింగ్, సాయి ప్రవీణ్, ఏవో నర్మద తదితరులు పాల్గొన్నారు.

