కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్ నగర్ (Mahabubnagar) పట్టణ కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో తక్షశిల పేరుతో నడుస్తున్న శ్రీ చైతన్య పాఠశాల (Sri Chaitanya School) పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో గురువారం సీపీఐ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు రాము, ప్రశాంత్, నందు మాట్లాడుతూ.. గత మూడు నెలల క్రింద జిల్లా కలెక్టర్‌కు పాఠశాలపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు. కలెక్టర్ స్పందించి డీఈవోకు ఎంక్వయిరీ చేయాలని ఆదేశాలు ఇచ్చారన్నారు. ఎంఈఓ ఎంక్వయిరీ చేసి రెండు నెలల క్రితం డీఈవో ఆఫీస్‌కు రిపోర్ట్ ఇచ్చారని తెలిపారు.
కానీ ఇప్పటి వరకు డీఈవో వారి సిబ్బంది ఎంఈఓ ఇచ్చిన తక్షశిల పాఠశాల ఫైల్‌ను బయటకు తీయకుండా, చర్యలు చేపట్టకుండా పాఠశాల యాజమాన్యానికి తోత్తులుగా మారారని వారు ఆరోపించారు. రిపోర్ట్ ఇచ్చి 2 నెలలు గడుస్తున్నా డీఈవో ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తక్షణమే డీఈవో స్పందించి క్లోసింగ్ ఆర్డర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. త్వరలో ఎంఈఓ ఇచ్చిన రిపోర్ట్ మీడియా ముందు పెడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో యువజన సంఘం నాయకులు మహేష్ బాబు, నరహరి,సాయి. తదితరులు పాల్గొన్నారు.

