కలం, వెబ్ డెస్క్: ఎలాంటి గుర్తింపు లేకపోయినా తప్పుడు ప్రకటనలతో అడ్మిషన్లు చేపించుకొని విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్న డిగ్రీ కాలేజీ (Degree College) యాజమాన్యాలపై హైదరాబాద్ పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. విద్యార్థులను మోసగిస్తున్న ఆయా కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ (CP Sajjanar) వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. డిగ్రీ కోర్సుల్లో చేరబోయే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కాలేజీల ఎంపిక పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కొన్ని కాలేజీలు ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేషన్ లేకపోయినా ఉన్నట్లుగా ప్రచారం చేసుకొని అడ్మిషన్లు చేసుకుంటూ విద్యార్థులను మోసం చేస్తున్నాయని చెప్పారు. ఈ విషయాన్ని ఉస్మానియా ఉన్నతాధికారులే తమ దృష్టికి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. అధికారులు అందించిన సమాచారంతో పలు కాలేజీలపై విచారణ చేపట్టగా వాటికి ఎలాంటి గుర్తింపు లేదని స్పష్టమైందన్నారు.
విద్యార్థులు ఇలాంటి కాలేజీల మోసపూరిత ప్రకటనలు నమ్మి విద్యా సంవత్సరాన్ని, డబ్బును నష్టపోవద్దని సూచించారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న దోస్త్ వెబ్‌సైట్‌లో ఉన్న గుర్తింపు పొందిన కాలేజీల్లోనే చేరాలని సూచించారు. అనుమతి లేని కాలేజీల గురించి ఎవరికైనా వివరాలు తెలిస్తే వెంటనే డయల్ 100కి ఫోన్ చేసి చెప్పాలని, లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు.

