హైదరాబాద్ పోలీసింగ్‌లో సరికొత్త విప్లవం.. ప్రతి పీఎస్‌లో ‘మెంటార్’

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ సిటీలో భద్రతను మరింత బలోపేతం చేసేందుకు సిటీ పోలీస్ సరికొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ‘మార్గదర్శక్’ కార్యక్రమానికి అనుబంధంగా కొత్తగా ‘పోలీస్ మెంటార్స్ ప్రోగ్రామ్’ను (Police Mentors) తీసుకువస్తున్నట్లు సీపీ సజ్జనర్ ప్రకటించారు. ఇకపై ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కానిస్టేబుల్‌ను మెంటార్‌గా నియమిస్తామని, వారు క్షేత్రస్థాయిలో మార్గదర్శక్ వలంటీర్లతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పనిచేస్తారని ఆయన తెలిపారు.

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ ఆడిటోరియంలో హెచ్‌సీఎస్‌సీ ఆధ్వర్యంలో జరిగిన మార్గదర్శక్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న 80 మంది వలంటీర్లకు సర్టిఫికెట్లను ప్రదానం చేయడంతోపాటు, మార్గదర్శక్ లోగోను ఆవిష్కరించి, రెండో దశ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సజ్జనర్ (CP Sajjanar) మాట్లాడుతూ.. నగరంలో ప్రజా భద్రత, అత్యవసర సేవల్లో భాగస్వాములుగా ఉంటూ, ప్రజలను చైతన్యవంతమైన వలంటీర్లుగా తీర్చిదిద్దడమే మార్గదర్శక్ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. బాధితులకు తక్షణ అండగా నిలుస్తూ, పోలీసు వ్యవస్థకు ‘ఫోర్స్ మల్టిప్లయర్స్’గా పనిచేసేలా పౌరులను సిద్ధం చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

సమాజంలో మహిళలు ఎదుర్కొనే వేధింపులు, పని ప్రదేశాల్లో ఇబ్బందులు, గృహ హింస వంటి ఘటనల్లో చాలామంది మౌనంగా ఉండిపోతున్నారని, అందుకేమార్గదర్శక్ వ్యవస్థను తీసుకువచ్చామన్నారు. సమస్యను చూసి తప్పుకునే ప్రేక్షకులుగా కాకుండా, సమాజంలో మార్పు తెచ్చే ‘చేంజ్ మేకర్స్’గా ప్రజలు ఎదగాలని పిలుపునిచ్చారు. షీ టీమ్స్, భరోసా కేంద్రాలు, సైబర్ క్రైమ్ పోలీసులకు, బాధితులకు మధ్య మార్గదర్శకులు నమ్మకమైన వారధిగా పనిచేయాలని, నిబద్ధతతో కూడిన సేవలే పోలీస్ వ్యవస్థకు గౌరవాన్ని తెస్తాయని చెప్పారు. పోలీసింగ్‌లో అయినా, సామాజిక సేవలో అయినా నాణ్యత, క్రమశిక్షణ కీలకమని, వలంటీర్లు ఆ దిశగా అడుగులు వేయాలని కోరారు.

రాబోయే రోజుల్లో రిటైర్డ్ అధికారులు, విద్యావేత్తలు, నిపుణుల సేవలను కూడా ఈ వ్యవస్థలో భాగస్వామ్యం చేస్తామని వెల్లడించారు. మార్గదర్శకులు మొదటి స్థాయిలో సహాయం అందిస్తే, ఆయా స్టేషన్లలోని పోలీస్ మెంటార్లు (Police Mentors) వారికి నిరంతర తోడ్పాటును అందిస్తారని తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, గేటెడ్ కమ్యూనిటీలు, ఆఫీసుల్లో ఈ నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేస్తామని పేర్కొన్నారు. సురక్షితమైన హైదరాబాద్ నిర్మాణమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

Read Also: సీఎం రేవంత్ రెడ్డికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు సవాల్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>