కలం, మెదక్ బ్యూరో: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని వ్యాఖ్యానించిన సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao ) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డికి పాలన చేత కావడం లేదని, అనవసరంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సాయం అంశంపై కాంగ్రెస్ ఎంపీల రాజీనామా అవసరం లేదని.. కేవలం శాసన సభను రద్దు చేస్తే చాలని, 8 మంది బీజేపీ ఎంపీలు రాజీనామా చేయడానికి సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.
రాష్టంలోనీ కల్లాల్లో ధాన్యం పోక..బ్యాంకుల్లో డబ్బులు రాక రైతులు ఇబ్బందులు పడితే సీఎం స్పందించడం లేదని రఘునందన్ మండిపడ్డారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కేంద్ర పథకాలతోనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రగల్బాలు పలకడం కాదు, చేతనమైతే తన సవాల్ స్వీకరించాలని డిమాండ్ చేశారు.

