Mobile Popup Ad
Mobile Popup Ad

కబ్జాదారుల కోరల్లో చిరతనాల చెరువు.. 41 ఎకరాల నుంచి 6 ఎకరాలకు కుదింపు!

కలం, ఖమ్మం బ్యూరో: ప్రకృతి ప్రసాదించిన జలవనరులు మానవ స్వార్థానికి, అధికారుల నిర్లక్ష్యానికి ఎలా బలవుతాయో చెప్పడానికి భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా పాల్వంచ మండలంలోని ఉప్పలకుంట (చిరతనాల) (Chiratanala Lake) చెరువే సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఒకప్పుడు సువిశాల విస్తీర్ణంతో పచ్చని పంట పొలాలకు జీవనాడిగా నిలిచిన ఈ జలవనరు, నేడు కబ్జాదారుల కోరల్లో చిక్కుకుని తన అస్తిత్వాన్ని కోల్పోతోంది.

పుల్లాయిగూడెం గ్రామంలోని యానంబైల్ రెవిన్యూ పరిధిలో ఉన్న ఈ చెరువు ఒకప్పుడు 41 ఎకరాల విస్తీర్ణంలో అలరారేదని, కానీ ప్రస్తుతం అది కేవలం 6 ఎకరాల కుంటగా మారిపోయిందని స్థానిక రైతులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీరు, భూగర్భ జలాల పెరుగుదలకు ఆధారంగా నిలవాల్సిన ఈ ప్రజా ఆస్తి క్రమంగా కబ్జాలకు గురై, నేడు పామాయిల్ తోటలుగా మారిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ​ఈ దారుణమైన ఆక్రమణల పర్వం వెనుక ఒక పక్కా ప్రణాళిక ఉన్నట్లు స్పష్టమవుతోంది.

గ్రామస్తుల కథనం ప్రకారం.. కొందరు అక్రమార్కులు చెరువు శిఖం భూములను దశలవారీగా ఆక్రమించుకుంటూ, మట్టి నింపి వాటిని వ్యవసాయ భూములుగా మార్చేశారు. ఇప్పటికే పలువురు ఆక్రమణదారులు అక్కడ యథేచ్ఛగా పామాయిల్ సాగు చేస్తున్నప్పటికీ, వారిపై సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. గతంలో ఆక్రమించిన వారిని ఎవరూ అడగకపోవడంతో, అదే ధైర్యంతో మరికొందరు కబ్జాదారులు కూడా అదే బాట పట్టారు. చట్టాలు తమను ఏమీ చేయలేవనే ధీమాతో చెరువు భూములను మింగేసే కార్యక్రమం నిరంతరాయంగా సాగుతోంది.

పగటిపూట జనం చూస్తే ఎక్కడ తిరగబడతారో, లేదా అధికారులకు దొరికిపోతామనే భయంతో కబ్జాదారులు రాత్రి సమయాన్ని వేదికగా చేసుకొంటున్నారు. భారీ జేసీబీల సహాయంతో రాత్రికి రాత్రే చెరువు ప్రాంతంలో మట్టి నింపి, భూమిని చదును చేస్తున్నారు. ఇంత బహిరంగంగా ప్రజా జలవనరు ధ్వంసమవుతున్నా, రాత్రివేళల్లో భారీ యంత్రాలు నడుస్తున్నా స్థానిక యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న మర్మమేమిటో?

సామాన్య ప్రజల చిన్నచిన్న సమస్యలపై, పేదల భూ వివాదాలపై క్షణాల్లో స్పందించే అధికారులు, ఇంత పెద్ద జలవనరు మాయమవుతుంటే ఎందుకు మౌనం వహిస్తున్నారని గ్రామస్తులు ముక్తకంఠంతో నిలదీస్తున్నారు. ​ఒక్క రోజులో 35 ఎకరాల చెరువు మాయం కావడం అసాధ్యమని, ఇది ఏళ్ల తరబడి సాగుతున్న అధికారిక నిర్లక్ష్యానికి, కబ్జాదారుల తెగింపునకు నిదర్శనమని రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వ రికార్డుల్లో స్పష్టంగా చెరువుగా నమోదైన భూమిలో పామాయిల్ తోటలు వెలుస్తున్నా, మట్టి నింపి చదును చేస్తున్నా చర్యలు శూన్యమంటే.. దీని వెనుక బలమైన రాజకీయ అండదండలు ఉన్నాయా, లేక కొందరు పెద్దల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చెరువులు కేవలం నీటి నిల్వ కేంద్రాలు మాత్రమే కాదని, అవి గ్రామీణ వ్యవసాయానికి, పర్యావరణ సమతుల్యతకు జీవనాధారమని రైతులు గుర్తుచేస్తున్నారు. ​ఇప్పటికైనా రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు నిద్రమత్తు వదిలి సంయుక్తంగా సమగ్ర సర్వే నిర్వహించాలని, చిరతనాల చెరువు అసలు విస్తీర్ణాన్ని, శిఖం భూములను గుర్తించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. చెరువు భూములను ఆక్రమించి పామాయిల్ తోటలు సాగు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, రాత్రివేళల్లో మట్టి నింపివేతలకు పాల్పడిన వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు మేల్కొని చర్యలు తీసుకోకపోతే, రానున్న రోజుల్లో సాగునీరు, తాగునీటి సమస్యలు తీవ్రమై గ్రామ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతుందని, ఆ తర్వాత కేవలం ‘చిరతనాల చెరువు’ అనే పేరు మాత్రమే చరిత్రలో మిగిలిపోతుందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>