కలం, నిజామాబాద్ బ్యూరో: ఈ నెల 21వ తేదీ ఆదివారం నిర్వహించనున్న NEET-UG 2026 రీ-ఎగ్జామినేషన్ సందర్భంగా.. నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు ఇన్‌ఛార్జ్ పోలీసు కమిషనర్ రాజేష్ చంద్ర (CP Rajesh Chandra) తెలిపారు. పరీక్ష ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేందుకు అన్ని పరీక్షా కేంద్రాల పరిసరాలలో సెక్షన్ 163 బి.ఎన్.ఎస్.ఎస్ (పాత సెక్షన్ 144 సి.ఆర్.పి.సి) అమలు ఉంటుందని తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే భద్రతా పరంగా ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షా కేంద్రాల పరిసరాలలో పోలీసు ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. ఈ ఉత్తర్వుల ప్రకారం పరీక్షా కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఇద్దరికి మించి గుంపులుగా చేరడాన్ని నిషేధించారు. పరీక్షా సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అన్ని కేంద్రాల వద్ద ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
అదేవిధంగా పరీక్ష జరిగే రోజు సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలను తప్పనిసరిగా మూసివేయాలని యజమానులకు సూచనలు జారీ చేసినట్లు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులపై కఠిన నిఘా ఉంచుతామని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చివరగా, పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులందరూ ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో రాసి విజయవంతంగా ఉత్తీర్ణత సాధించాలని పోలీస్ కమిషనర్ ఆకాంక్షించారు.

