కలం, నిర్మల్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్మల్ (Nirmal) జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకంగా మైక్ ద్వారా పబ్లిక్ అనౌన్స్‌మెంట్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ… గ్రామ పంచాయతీల ద్వారా మైక్ అనౌన్స్‌మెంట్లు నిర్వహిస్తే ప్రవేశాలపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అవగాహన పెరిగి ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం ఉంటుందన్నారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అనుభవజ్ఞులైన అధ్యాపకులు, గ్రంథాలయ సౌకర్యం, కంప్యూటర్ ల్యాబ్‌లు, స్కాలర్‌షిప్‌లు తదితర సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని గ్రామాల్లో విస్తృత ప్రచారం చేపట్టేందుకు అధికారుల సహకారం అందించాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు కూడా ప్రభుత్వ కళాశాలల్లో చదివేందుకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

