కలం, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ (Nagarkurnool) మున్సిపాలిటీ పరిధిలోని రహమత్‌నగర్ కాలనీ, నక్కలవాగు వద్ద ఉన్న మున్సిపాలిటీకి చెందిన ఇన్లెట్‌వెల్ (పాత బావి)ను ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా కూల్చివేసిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు వార్డు కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మున్సిపల్ కమిషనర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 9వ తేదీన కొందరు వ్యక్తులు అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా జేసీబీ సాయంతో ఈ పాత బావిని పూర్తిగా కూల్చివేశారని తెలిపారు. దీనివల్ల సుమారు రూ. 20 లక్షలకు పైగా విలువైన ప్రభుత్వ ఆస్తి ధ్వంసమైందని ఆవేదన వ్యక్తం చేశారు. కూల్చివేత మూలంగా వర్షపు నీరు కేసరి సముద్రం చెరువులోకి వెళ్లే దారి మూసుకుపోయి, కాలనీ ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు.
పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద కూల్చివేతలు జరపడం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు. సదరు అక్రమ కూల్చివేతకు బాధ్యులైన వ్యక్తులతో పాటు, దానికి సహకరించిన జేసీబీ యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, కూల్చివేసిన స్థలాన్ని వెంటనే మున్సిపాలిటీ స్వాధీనం చేసుకుని చుట్టూ రక్షణ గోడ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ వినతిపత్రం సమర్పించిన వారిలో 1వ వార్డు కౌన్సిలర్ అర్జునయ్య, 2వ వార్డు కౌన్సిలర్ తిమ్మాజీపేట పాండు, 12వ వార్డు కౌన్సిలర్ డి. కవిత, 10వ వార్డు కౌన్సిలర్ జేపీ చారి, 12వ వార్డు కౌన్సిలర్ జయలక్ష్మి, 13వ వార్డు కౌన్సిలర్ గంగాధర్ తదితరులు ఉన్నారు.

