సిలిండర్ పేలి కుప్పకూలిన రెండంతస్తుల భవనం .. నలుగురు మృతి

కలం, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫతేపూర్ (Fatehpur Blast ) జిల్లా మాల్వాన్ టౌన్‌లో మంగళవారం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ పేలడంతో రెండు అంతస్తుల భవనం క్షణాల్లో కుప్పకూలిపోయింది. ఈ భయాందోళనకర ఘటనలో మూడేళ్ల చిన్నారితో సహా నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మాల్వాన్ టౌన్‌లోని సురేష్ గుప్తా నివాసంలో వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ పేలుడు తీవ్రత ఎంత దారుణంగా ఉందంటే, ఆ ప్రభావానికి సురేష్ గుప్తాకు చెందిన రెండు అంతస్తుల కాంక్రీట్ భవనం కుప్పకూలింది. అంతేకాదు సిలిండర్ పేలిన ధాటికి దాదాపు 200 మీటర్ల పరిధి వరకు భూకంపం వచ్చినట్లుగా భారీ ప్రకంపనలు వచ్చాయని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న మరో రెండు ఇళ్లు కూడా తీవ్రంగా ధ్వంసమయ్యాయి. అయితే, ఆ సమయానికి ఆ రెండు ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో మరింత ప్రాణనష్టం తప్పిందని అధికారులు అంటున్నారు.

కాగా, సిలిండర్ పేలుడు ధాటికి భవనం శిథిలాల కింద చిక్కుకుని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మూడేళ్ల బాలుడు కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు. గాయపడిన ముగ్గురిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది.

ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీలతో శిథిలాలను తొలగిస్తూ లోపల ఎవరైనా చిక్కుకున్నారేమోనని గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>