బోనకల్‌లో పత్తి నిల్వకు నిప్పు.. 10 క్వింటాళ్లు దగ్ధం

కలం, బోనకల్: రెండుకాలాల కష్టం.. ఎన్నో ఆశలతో పండించిన పత్తి పంట గుర్తుతెలియని వ్యక్తుల దుశ్చర్యతో అగ్నికి ఆహుతైంది. ఖమ్మం జిల్లా బోనకల్ మండల పరిధిలోని తూటికుంట్ల గ్రామానికి (Thutikuntla Village) చెందిన కౌలు రైతు తన్నీరు శ్రీనివాసరావు తండ్రి వెంకయ్యకు చెందిన పత్తి నిల్వకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించడంతో సుమారు 10 క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది.

స్థానికుల వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో రైతుకు చెందిన సుమారు 70 క్వింటాళ్ల పత్తి నిల్వ ఉన్న ప్రాంతంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గమనించిన ఇంటి యజమానురాలు వెంటనే చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేశారు. దీంతో స్పందించిన గ్రామ రైతులు, యువకులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వారి సకాలపు స్పందనతో మిగిలిన పత్తికి మంటలు వ్యాపించకుండా అడ్డుకోగలిగారు. అయినప్పటికీ సుమారు 10 క్వింటాళ్ల పత్తి పూర్తిగా కాలిపోయినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే వ్యవసాయ పెట్టుబడులు, సాగు ఖర్చులు, ప్రకృతి వైపరీత్యాలతో సతమతమవుతున్న రైతులకు ఇలాంటి ఘటనలు మరింత ఆవేదన కలిగిస్తున్నాయి. కష్టపడి పండించిన పంటను గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించి నాశనం చేయడంపై కౌలు రైతు తన్నీరు శ్రీనివాసరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై గ్రామ సర్పంచ్ తుళ్లూరు లక్ష్మీ నరసయ్య స్పందిస్తూ.. రైతు కష్టాన్ని బూడిద చేసిన ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని బోనకల్ ఎస్‌ఐకి తెలియజేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మరే రైతుకూ జరగకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>