నల్లగొండలో ఘోర ప్రమాదం.. యువకుడిని చిదిమేసిన లారీ

కలం, నల్లగొండ : నల్లగొండ (Nalgonda) పట్టణ శివారులోని చర్లపల్లి ఫ్లైఓవర్ బైపాస్ రోడ్డు వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజస్థాన్‌కు చెందిన కంటైనర్ అతివేగంగా దూసుకొచ్చి ఒక ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే అత్యంత దారుణంగా ప్రాణాలు కోల్పోయారు.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని చలకుర్తి గ్రామానికి చెందిన బొల్లం లింగయ్య తన పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఈ విషాదం సంభవించింది. రాజస్థాన్ రిజిస్ట్రేషన్ కలిగిన భారీ కంటైనర్ లారీ.. లింగయ్యను ఢీ కొట్టడమే కాకుండా, ఆయనపై నుండి దూసుకెళ్లింది. ఈ ఘటనలో లింగయ్య శరీరం పూర్తిగా ఛిన్నాభిన్నమై, గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఈ ప్రమాదానికి సంబంధించి స్థానికులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు.

ప్రమాదం జరిగిన సమయంలో సమీపంలో ఆర్టీఓ అధికారులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల నుండి తప్పించుకోవాలనే ఉద్దేశంతో లారీ డ్రైవర్ వాహనాన్ని ఒక్కసారిగా వేగంగా పోనిచ్చాడని, ఈ క్రమంలోనే నియంత్రణ కోల్పోయి బైక్‌ను ఢీ కొట్టాడని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. అధికారుల తనిఖీల వల్ల కలిగే భయమే ఈ ప్రాణం పోవడానికి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>