కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రామానుజవరం సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ హైవే(Greenfield Highway)పై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌లోని బొల్లారం పోలీస్ స్టేషన్‌కు చెందిన 2021 బ్యాచ్ కానిస్టేబుల్ స్వర్ణకంటి జస్వంత్ (36) అక్కడికక్కడే మృతి చెందారు. కాగా కారులో ప్రయాణిస్తున్న ఆయన భార్య, కూతురు, కుమారుడు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కానిస్టేబుల్ జస్వంత్ తన కుటుంబంతోకలిసి ఏపీలోని అన్నవరం నుంచి కారులో హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో కారు తల్లాడ మండలం రామానుజవరం సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపైకి రాగానే ఒక్కసారిగా అదుపుతప్పింది. రహదారి పక్కనే ఉన్న ఐరన్ రైలింగ్‌ను బలంగా ఢీకొట్టింది. పల్టీలు కొడుతూ హైవేపై పడిపోయింది. ఈ ప్రమాదంలో కారు తీవ్రంగా ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న జస్వంత్ భార్య, ఇద్దరు పిల్లలు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడటం గమనార్హం.
గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, కారులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న తల్లాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జస్వంత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన కుటుంబ సభ్యులకు ప్రాథమిక చికిత్స అందించారు. సహోద్యోగి, యువ కానిస్టేబుల్ జస్వంత్ అకాల మరణంతో బొల్లారం పోలీస్ స్టేషన్‌లో ఆయన స్వగ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
ఖమ్మం జిల్లా గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర ప్రమాదం

