epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఇక ఊరూరా.. ఉపాధి హామీపై కాంగ్రెస్ సంచలన నిర్ణయం

కలం, వెబ్​ డెస్క్​: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని(MGNREGA) కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు రూపొందించిన ప్రత్యేక కరపత్రాలను అన్ని జిల్లాల్లో డీసీసీ అధ్యక్షులు విడుదల చేయాలని పార్టీ ఆదేశించింది. ‘వీబీ రామ్ జీ’ పేరుతో కేంద్రం తెచ్చిన కొత్త చట్టం వల్ల గ్రామీణ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలకు వివరించేందుకు ఈ కరపత్రాలను గ్రామగ్రామాన పంపిణీ చేయాలని నిర్ణయించారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త మార్పుల వల్ల పని హక్కుకు తీవ్ర విఘాతం కలుగుతోందని కాంగ్రెస్  (Congress) విమర్శించింది. గతంలో ఏడాదికి 100 రోజుల పని హక్కు చట్టబద్ధంగా ఉండేదని, కానీ ఇప్పుడు కేంద్రం బడ్జెట్ కేటాయిస్తేనే పని లభించే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. అలాగే వ్యవసాయ సీజన్‌లో 60 రోజుల పనులపై నిషేధం విధించడం వల్ల కూలీలు తీవ్రంగా నష్టపోతున్నారని, గతంలో ఏడాది పొడవునా పని కల్పించే విధానాన్ని మార్చి వేయడం అన్యాయమని పార్టీ ఆరోపించింది.

నిధుల కేటాయింపులోనూ కేంద్రం చేతులెత్తేసిందని కాంగ్రెస్ (Congress) ఎండగట్టింది. గతంలో ఉపాధి హామీ వేతనాల్లో 100 శాతం నిధులను కేంద్రమే భరించేదని, కానీ ఇప్పుడు తన వాటాను 60 శాతానికి తగ్గించి మిగిలిన 40 శాతం భారాన్ని రాష్ట్రాలపై మోపుతోందని వివరించింది. దీనివల్ల రాష్ట్రాలపై ఆర్థిక భారం పెరిగి వేతనాల చెల్లింపులో జాప్యం జరుగుతోందని, ఇది కూలీల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తోందని పార్టీ ఆవేదన వ్యక్తం చేసింది.

పంచాయతీల అధికారాలను కేంద్రం లాగేసుకుంటోందని కరపత్రంలో కాంగ్రెస్ ముఖ్యంగా ప్రస్తావించింది. గతంలో ఏ పనులు చేపట్టాలో గ్రామసభలు నిర్ణయించేవని, ఇప్పుడు ఢిల్లీ నుంచే నిర్ణయాలు జరగడం వల్ల స్థానిక అవసరాలు పట్టించుకోవడం లేదని విమర్శించింది. గ్రామాల్లో నిర్మించే ఆస్తులపై ప్రజలు హక్కులు కోల్పోతున్నారని, పంచాయతీలు కేవలం కూలీలను సరఫరా చేసే కేంద్రాలుగా మారిపోతున్నాయని ఆరోపించింది.

అవినీతికి ఆస్కారం లేని ఉపాధి హామీ పథకంలోకి కాంట్రాక్టర్లను ప్రవేశపెట్టడంపై కాంగ్రెస్ (Congress) తీవ్ర అభ్యంతరం తెలిపింది. గతంలో కాంట్రాక్టర్లపై నిషేధం ఉండగా, ఇప్పుడు కొత్త నిబంధనలతో వారిని అనుమతించడం వల్ల కూలీల దోపిడీకి తలుపులు తెరిచినట్లయిందని పేర్కొంది. అలాగే డిజిటల్ హాజరు, యాప్​ల వంటి సాంకేతిక నిబంధనల వల్ల ఇంటర్నెట్ సౌకర్యం లేని పేదలు పని కోల్పోతున్నారని వివరించింది. ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి వరకు ఆందోళనలు కొనసాగిస్తామని పార్టీ స్పష్టం చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>