కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని బీఆర్‌ఎస్ (BRS) కైవసం చేసుకుంది. భారీ బందోబస్తు, ఆందోళనల మధ్య జరిగిన ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ముగిసింది.ఇబ్రహీంపట్నం చెర్మన్ గా బీఆర్ఎస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. వైఎస్ చైర్‌పర్సన్‌గా బీజేపీ కౌన్సిలర్ శ్యామలను ఎన్నుకున్నారు. అయితే మంత్రి వర్గ విస్తరణలో తన పేరు ఉండాలని మల్ రెడ్డి రంగారెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో సొంత నియోజకవర్గంలోని మున్సిపాలిటీని చేజార్చుకోవడంతో ఆయన ఆశలు గల్లంతనట్లేనని తెలుస్తోంది.
ఇదిలాఉంటే సభ్యులు చేతులు ఎత్తే (Show of Hands) విధానం ద్వారా కాంగ్రెస్ అభ్యర్ఠి ఆకుల యాదగిరి పై బీఆర్ఎస్ తరపున చైర్మన్ అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. మెజారిటీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు తెలపడంతో సుదర్శన్ రెడ్డి గెలిచారు. ఎన్నిక ప్రారంభానికి ముందే కాంగ్రెస్ కౌన్సిలర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముగ్గురు కౌన్సిలర్లపై కోర్టులో కేసులు కొనసాగుతున్నాయని, తీర్పు వచ్చే వరకు ఎన్నికను వాయిదా వేయాలని వారు డిమాండ్ చేశారు. అయితే హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాల మేరకు నోటిఫికేషన్ విడుదల చేసి నిర్వహిస్తున్నామని ఎన్నికల అధికారి తేల్చి చెప్పడంతో ఎన్నిక ప్రక్రియను నిర్వహించారు. కాగా, మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎరిగింది. క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్‌గా బీఆర్ఎస్ కౌన్సిలర్ గొడిశెల సంధ్యారాణి ఎన్నికయ్యారు. ఇక్కడ బీఆర్ఎస్, సీపీఐ మైత్రితో అధికార కాంగ్రెస్ పార్టీకి చెక్ పడింది. వైస్ చైర్ పర్సన్‌గా సీపీఐ కౌన్సిలర్ మిట్టపల్లి సరితను ఎన్నుకున్నారు.

