కలం, వెబ్‌డెస్క్: సర్పంచ్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో తమ మద్దతుదారులను గెలిపించుకోవాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఆ పార్టీ నేతలకు కొన్ని చోట్ల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి ప్రజలు నేతలను నిలదీస్తున్నారు. అయితే ఈ నిరసనల వెనుక ప్రతిపక్షాలు ఉన్నాయేమో తెలియదు కానీ.. అక్కడక్కడా వ్యతిరేకత మాత్రం కనబడుతోంది. ఈ క్రమంలో ప్రచారానికి వెళ్లిన వర్ధన్నపేట(Wardhannapet) కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు (MLA KR Nagaraj)ను ప్రజలు నిలదీశారు.
పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వర్ధన్నపేట మండలంలోని ఉప్పరపల్లి, నల్లబెల్లి, రాంధాన్ తండా సహా పలు గ్రామాల్లో ఎమ్మెల్యే నాగరాజు (MLA KR Nagaraj) పర్యటించి తన మద్దతుదారుల తరఫున ప్రచారం చేశారు. అయితే ఇందిరమ్మ ఇండ్లు తమకు కేటాయించలేదని.. యూరియా బస్తాలు సకాలంలో అందడం లేదని ప్రజల నుంచి ఆయనకి నిరసన ఎదురైంది. దీంతో పోలీసులు నిరసన తెలిపినవారిని అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లారు. ఒక్క వర్దన్నపేట నియోజకవర్గంలోనే కాక అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇదే పరిస్థితి ఎదురవుతోంది.
ఓ వైపు ప్రజాపాలన విజయోత్సవాల పేరిట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటిస్తూ జోష్ నింపుతున్నారు. మంత్రులు కూడా సర్పంచ్ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని తమ మద్దతుదారులను గెలిపించుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో వారికి అవాంతరాలు కూడా ఎదురవుతున్నాయి. మరి వీటిని ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు సాగుతుందో వేచి చూడాలి. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ టికెట్లు, గుర్తులు ఉండవు కాబట్టి పెద్దగా ప్రభావం ఉండదు. గెలిచిన అభ్యర్థులు అధికారపార్టీ గూటికి చేరుకొనే అవకాశం ఉంటుంది. కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మాత్రం అధికార పార్టీ కచ్చితంగా సవాళ్లను ఎదుర్కోక తప్పదేమో.
Follow Us on: Youtube


