కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి (Jeevan Reddy) రాజీనామా చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన రాజీనామా లేఖను విడుదల చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాజీనామా లేఖ పంపుతున్నట్లు పేరొన్నారు. జీవన్ రెడ్డితో పాటు 1500 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. నాలుగు దశాబ్దాలుగా పార్టీలో ఉంటూ జగిత్యాల నుంచి రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించిన జీవన్ రెడ్డి రాజీనామా చేయడం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటుగా తెలుస్తోంది. ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ మంత్రులు, నాయకులు ఆయనతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి.
బాధతప్త హృదయంతో పార్టీని వీడుతున్నానని జీవన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. 40 ఏళ్ల పాటు పార్టీ కోసం నిస్వార్థంగా పని చేసిన తనకు పార్టీలో సరైన గౌరవం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్యేల బలం ఉన్నప్పటికీ, వేరే పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. పార్టీ ఫిరాయింపులు మంచివి కాదని తానుమొదటి నుంచే చెబుతున్నానని పేర్కొన్నారు. జగిత్యాల ఎమ్మెల్యేను కార్యకర్తలకు ఇష్టం లేకపోయినా పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు. తనతో ఉన్న కార్యకర్తలకు కూడా న్యాయం చేయలేకపోయాను అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ అంటూ ముందుకు వెళ్తుంటే, ఇక్కడ మాత్రం ఆ విలువలను నీరుగార్చే విధంగా వ్యవహరిస్తున్నారని రేవంత్ సర్కార్ పై విమర్శలు చేశారు. ఎమ్మెల్యే సంజయ్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘ప్రభుత్వంతో కలిసి పని చేయడం వేరే విషయం కానీ, పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం ఎందుకు?’ అని ప్రశ్నించారు. తన అనుచరుడి హత్య జరిగినప్పుడు కూడా ముఖ్యమంత్రి పరామర్శించలేదని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఓపికకు కూడా హద్దు ఉంటుందని 20 నెలలుగా అవమానాలు భరిస్తూ వచ్చానని చెప్పారు. గౌరవం లేని చోట ఎలా పని పనిచేయాలంటూ పార్టీకి రాజీనామా చేశారు.

